
అక్రమ బదిలీలు రద్దు చేయాలి
ఆమదాలవలస ఎమ్మెల్యే
వేధిస్తున్నారు
నిరసన కార్యక్రమంలో భాగంగా పొందూరు కేజీబీవీ ఎస్‌వో ఆర్.సౌమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని కన్నీటి పర్యంతమయ్యారు.
శ్రీకాకుళం: కేజీబీవీ ఎస్‌వో (ప్రిన్సిపాల్స్)ల అక్రమ బదిలీలు రద్దు చేయాలని, నిబంధనలు పాటించని ఏపీసీని విధుల నుంచి తొల గించాలని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్, యూటీఎఫ్ సీనియర్ నాయకురాలు కె.విజయగౌరిలు డిమాండ్ చేశారు. జిల్లాలోని కంచిలి, గార, పొందూరు కేజీబీవీల ప్రిన్సిపాల్స్‌ను స్థానిక ఎమ్మెల్యేల లేఖల ఆధారంగా బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద సమగ్ర శిక్షా ఎంప్లాయీస్ జేఏసీ, యూటీఎఫ్, సీఐటీయూ సంయుక్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై విచారణ జరపకుండానే చర్యలు తీసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రిన్సిపాల్స్ బదిలీకి రాష్ట్ర కార్యాలయం అనుమతి తప్పనిసరి అనే నిబంధనను ఉల్లంఘించడమే కాకుండా, బదిలీలకు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ అని కారణాన్ని పేర్కొనడం ద్వారా వాస్తవాలను దాచే ప్రయత్నం కనిపిస్తోందని విమర్శించారు.
అధికారి అత్యుత్సాహం
సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ అధికారి రాజకీయ ఆశీస్సుల కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, సెలవు రోజుల్లో కూడా ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. మహిళా ఉద్యోగులను స్థానిక రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా దూషించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధింపులపై ఫిర్యాదు చేయడంతో పాటు ఫోన్ ఆడియో రికార్డింగ్స్‌ను ఏపీసీకి అందజేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధిత ముగ్గురు ప్రిన్సిపాల్స్ కూడా ఒంటరి మహిళలని, వీరి కుటుంబాలు వీరిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ధర్నాకు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు హాజరై అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, కోశాధికారి అల్లు సత్యనారాయణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, యూటీఎఫ్ కోశాధికారి బి.రవికుమార్, జిల్లా కార్యదర్శి జి.సురేష్, కె.సురేష్, జి.విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.