
రైతన్నా.. జాగ్రత్త..!
నకిలీలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు
ఎరువుల దుకాణాల్లో నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు మా పరిశీలనలో గుర్తిస్తే దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తాం. మందులు కొనుగోలు చేసిన రైతులకు డీలర్, దుకాణ యజమాని సంతకాలతో కూడిన బిల్లులను అందజేయాలి. క్రిమి సంహారక మందులను కొనుగోలు చేసే సమయంలో డబ్బాపై ఉన్న వివరాలను పూర్తిగా పరిశీలించాలి. సంబంధిత ఎరువులు ఏ కంపెనీవో నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. డబ్బాపై చూపించిన వివరాల ప్రకారమే మందులు పిచికారీ చేయాలి. – బి.సంధ్య
మండల వ్యవసాయాధికారి, హిరమండలం
●
హిరమండలం:
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో పంట పొలాల్లో రైతులు అధికంగా ఎరువులు వినియోగిస్తారు. అయితే మార్కెట్‌లోకి నకిలీ ఎరువులు, పురుగు మందులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువులు కొనుగోలు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నా రు. అధికారుల సూచన మేరకు ఎరువులు, పురుగు మందులు తీసుకోవాలని, లేకుంటే నిలువునా మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
దళారుల వద్ద కొనుగోలు చేయవద్దు
నిషేధిత పురుగుల మందులు కొనుగోలు చేస్తే రైతులు నష్టపోతారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎరువుల వ్యాపారులు పంట దిగుబడి అధికంగా వస్తుందని నమ్మించి అనుమతిలేని వివిధ కంపెనీల కల్తీ ఎరువులు, పురుగు మందులు రైతులకు అంటగట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా అనుమతిలేని దుకాణాలు, దళారుల వద్ద కనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తే పంట దిగుబడి తగ్గడంతో పాటు భూసారం దెబ్బతింటుందని అంటున్నారు. మందుల లేబుల్స్ మొదట పరిశీలించి, అవి కంపెనీ ఎరువులా లేక స్థానికంగా తయారు చేసి విక్రయిస్తున్నారా అనే విషయాలు రైతులు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మందులు కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలంటున్నారు.
ఫిర్యాదు చేయండి
దుకాణాల వద్ద లైసెన్స్ లేకుండా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మందుల లాట్ నంబర్ ఆధారంగా తయారు చేసిన తేదీని గుర్తించడంతో పాటు ఏ కంపెనీ.. ఏ రకం వంటి విషయాలను చూడాలి. దుకాణ యజమాని, డీలర్ సంతకాలతో కూడిన బిల్లులను తప్పక తీసుకోవాలని, ముఖ్యంగా విత్తనాలకు సంబంధించిన సంచులపై సీలు తొలగించినట్లు గుర్తిస్తే వాటిని కొనుగోలు చేయకుండా నకిలీపై సత్వరం రైతులు ఫిర్యాదు చేయాలి. అధికారుల పరిశీలనలో అది వాస్తవమని తేలితే సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేసి రైతులకు న్యాయం జరగడానికి అవకాశం ముందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
మార్కెట్‌లో
నకిలీ ఎరువులు
కొనుగోలు
సమయంలో
అవగాహన అవసరం
మందులకు రశీదు
తప్పనిసరి

రైతన్నా.. జాగ్రత్త..!