
బంగారం పేరుతో బురిడీ
● సగం ధరకే ఇప్పిస్తామంటూ రూ.12 లక్షలతో ఉడాయించిన కేటుగాళ్లు
● లబోదిబోమంటున్న బాధితురాలు
పార్వతీపురం రూరల్: సగం ధరకే పావుకిలో బంగారం ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ మహిళ వద్ద రూ.12 లక్షలతో దుండగులు పరారైన ఘటన పార్వతీపురం పట్టణ శివారులో చోటుచేసుకుంది. బాధిత మహిళ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మిని తన వద్ద గతంలో విద్యనభ్యసించిన విద్యార్థిని భర్త రిషి అనే వ్యక్తి గతనెల జూలైలో కలిశారు. సగం దొరకే బంగారం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. పావుకిలో బంగారాన్ని రూ.12 లక్షలకు ఇప్పిస్తామని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని చెప్పాడు. ఆ మేరకు ఆమె ఈ నెల 11న డబ్బులు సిద్ధం చేశారు. ఆయన సూచన మేరకు బంగారం విక్రయించే వారి వద్దకు వెళ్లేందుకు బుధవారం పాలకొండకు ద్విచక్ర వాహనంపై చేరుకున్నారు. బంగారం విక్రయిస్తామని చెప్పిన ఇద్దరు వ్యక్తులతో మాట్లాడారు. బంగారాన్ని బహిరంగంగా చూపించడం కుదరదంటూ పార్వతీపురం శివారులో ఉన్న వాటర్‌పంప్ హౌస్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మాట్లాడుతున్న సమయంలో మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి శ్రీలక్ష్మి ముఖంపై మత్తు పౌడర్ చల్లారు. ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక రూ.12 లక్షలతో ఉడాయించారు. తనతో పాటు వచ్చిన రిషి అనే వ్యక్తి కూడా కనిపించకపోవడంతో పార్వతీపురం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిషి అనే వ్యక్తిని విచారణ చేసి కేసు నమోదు చేశామని పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి తెలిపారు.