
మందుల్లేవ్..!
● పశు ఆరోగ్య సంచార వాహనాల్లో
వింత పరిస్థితి
● మందులు లేకుండానే పల్లెలకు వెళ్తున్న వాహనాలు
● పాడి రైతులకు తప్పని అవస్థలు
పాతపట్నం:
పాడి రైతులు ఫోన్ చేసిన వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి వైద్యసేవలందించాల్సిన పశు ఆరోగ్య సంచార వాహనాలు రోజురోజుకూ నిర్వీర్యమైపోతున్నాయి. పశువుల చికిత్సకు మందులు లేకుండానే గ్రామాలకు వెళ్తున్నాయి. దీంతో పాడి రైతులు ప్రైవేటున మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పశువుల వైద్యానికి సత్వర సేవలు అందించేందుకు సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 1962 ట్రోల్ ఫ్రీ నంబర్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజవర్గానికి రెండు వాహనాలు ఉంచారు. రెండు మండలాలకు ఒక వాహనం చొప్పున వైద్య సేవలు అందించేవి. శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తే దగ్గరలోని ప్రాంతీయ పశు వైద్యశాలకు తరలించి, అక్కడ చికిత్స అందించి అనంత రం గ్రామానికి పంపించేవారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు రెండు చొప్పున సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు 16 ఉన్నాయి.
ప్రైవేటుగా మందుల కొనుగోలు
మూగ జీవాల చికిత్స కోసం వచ్చిన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో మందులు లేకపోవడంతో పాడి రైతులు పశు వైద్యుడు చెప్పిన మందులు రౖపైవేటు మందుల దుకాణంలో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో రైతులకు చేతి చమురు వదులుతోంది. సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను గతంలో జీవీకే సంస్థ నిర్వహించేది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవ్య హెల్త్ ప్రోవైడర్స్ సంస్థకు అప్పగించింది.
గతానికి భిన్నంగా...
సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను గతానికి భిన్నంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనంలో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కం అటెండర్ మొత్తం ముగ్గురు సిబ్బంది ఉంటారు. గతంలో నెలకు 8 వేల నుంచి 9 వేల కిలోమీటర్ల వరకు ఒక్కో వాహనం సేవలు అందించేవి. ఇప్పుడు వాహనాలు నెలకు 3 వేల కిలోమీటర్లు కూడా తిరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా రోజుకు రెండు మూడు గ్రామాల్లో వాహనం పెట్టి సేవలు అందిస్తున్నారు. అలాగు కొన్ని గ్రామాలకు వాహనాలు వెళ్లడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
సొంతంగానే మందులు
మా ఆవులకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఫోన్ చేయగానే సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలో వచ్చారు. వైద్యులు ఆవులకు వైద్యం చేసి మందులు రాశారు. వాహనంలో మందులు లేవని చెప్పారు. ఆ మందులను పాతపట్నం వెళ్లి బయట కొన్నాం.
– మహంతి జీవిశ్వరరావు,
ప్రహారాజపాలేం, పాతపట్నం మండలం
మందులు వచ్చాయి
సంచార పశువైద్యశాలల్లో మందుల కొరత ఉంది. ఇదివరకే ఇండెంట్ పెట్టాం. అయితే ప్రస్తుతం మందులు వచ్చాయి. వాటిని సంచార పశు వైద్యశాలలకు అందిస్తాం. ఇకపై పాడి రైతులకు ఇబ్బంది ఉండదు.
– డాక్టర్ ఎం.కరుణాకరరావు, సహాయ సంచాలకుడు, ప్రాంతీయ పశువైద్యశాల, పాతపట్నం
జిల్లాలో పశువుల సంఖ్య
ఆవులు 4,56,291
గేదెలు 40,477
గొర్రెలు 6,23,641
మేకలు 2,77,268
కోళ్లు 13,19,100

మందుల్లేవ్..!

మందుల్లేవ్..!

మందుల్లేవ్..!