
గంజాయితో నలుగురు అరెస్టు
నరసన్నపేట:
జాతీయ రహదారిపై మండలంలోని మడపాం టోల్‌గేట్, సత్యవరం ఫ్‌లై ఓవరు వంతెన కూడలి వద్ద నరసన్నపేట పోలీసులు నిర్వహించిన సోదాల్లో 21 కేజీల గంజాయిని సీజ్‌చేసి, నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. స్థానిక సర్కిల్ స్టేషన్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసన్నపేటలోని సూరజ్ నగర్‌లో గంజాయి సేవిస్తూ నరసన్నపేటకు చెందిన సూర కీర్తన్(మణి), గరక మోహన్‌లు పట్టుబడ్డారన్నారు. వీరు ఇచ్చిన సమాచారంతో సత్యవరం ఫ్‌లై ఓవరు వంతెన వద్ద తనిఖీలు చేస్తుండగా పర్లాకిమిడికి చెందిన సంజు అనే వ్యక్తి పట్టుబడ్డాడని, అతడి వద్ద నుంచి 21.750 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే సంజు స్నేహితుడు తేజను కూడా గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశామని వెల్లడించారు. నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించారని అభినందించారు. సమావేశంలో సీఐ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.