
జోడూరు కొండపై పురాతన విగ్రహాలు
మెళియాపుట్టి: జోడూరు గ్రామ పరిధిలోని కొండపై బుధవారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన రాయలహర్ష అనే 7వ తరగతి విద్యార్థి చెప్పిన సమాచారం మేరకు గ్రామస్తులు వెళ్లి పరిశీలించగా రెండు రాతి విగ్రహాలు గుర్తించారు. అయితే ఆ విద్యార్థి తనకు కలలో సంతోషిమాత ఈ విషయం చెప్పిందని పేర్కొనడం గమనార్హం.
పాఠశాలకు కుళ్లిన కోడిగుడ్లు
పొందూరు: మండలంలోని కోటిపల్లి ప్రాథమిక పాఠశాలకు సరఫరా చేసిన కోడిగుడ్లు పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. క్వాలిటీ గుడ్లు కాకుండా నాణ్యత లేని గుడ్లు అందించడంతో కుళ్లిపోతున్నాయని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. గుడ్లు కుళ్లిపోయిన విషయాన్ని మండల విద్యాశాఖాధికారులకు తెలిపారు.
దరఖాస్తులు ఆహ్వానం
సరుబుజ్జిలి: మండలంలోని వెన్నెలవలస జవహార్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ బి.బేతనసామి బుధవారం ప్రకటనలో తెలియజేశారు. పదో తరగతి చదివిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
జనావాసాల్లోకి ఎలుగు పిల్లలు
టెక్కలి: కోటబొమ్మాళి మండలం చలమయ్యపేట గ్రామానికి ఆనుకుని బుధవారం రెండు ఎలుగు బంటి పిల్లలు దారి తప్పి గ్రామ సమీపంలోని గోతుల్లో పడ్డాయి. ఇది గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ, అగ్నిమాపక శాఖాధికారులు గ్రామానికి చేరుకుని గోతుల్లో పడిన ఎలుగు బంటి పిల్లలను చాకచక్యంగా బయటకు తీసి సమీపంలోని కొండ ప్రాంతాల్లో విడిచిపెట్టారు. అయితే ఎలుగు బంటి పిల్లలు గ్రామ సమీపంలోకి చేరుకోవడంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా భయాందోళన చెందారు.

జోడూరు కొండపై పురాతన విగ్రహాలు

జోడూరు కొండపై పురాతన విగ్రహాలు