
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
టెక్కలి రూరల్: మండలంలోని నర్శిపురం గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. టెక్కలి నుంచి నర్శిపురం గ్రామం వైపు కె.రాజా, ఎ.రాము అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తూ నర్శిపురం అప్రోచ్ రోడ్డులోకి తిరుగుతున్న సమయంలో, అదే మార్గంలో మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న పి.సుమంత్, ఆర్.రోజాలను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.
మృతదేహం కలకలం
పలాస: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలోని పెంటభద్ర గ్రామానికి వెళ్లే దారిలో కుంకుమ సాగరం వద్ద సోమవారం గుర్తు తెలియని ఒక మృతదేహాన్ని స్థానికులు చూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి పలాస ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.