
కుడ్యచిత్రాలు వారసత్వ సంపద
గార: శ్రీకూర్మనాథ దేవస్థానంలోని ప్రాచీన కుడ్య చిత్రాలు వారసత్వ సంపదని, వీటిని పరిరక్షించి భావితరాలకు అందించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం దేవాలయంలో పునఃసృష్టి చేయబడిన కుడ్య చిత్రాలు ఫొటో ప్రదర్శన, మ్యూరల్స్ ఆఫ్ శ్రీకూర్మం టెంపుల్ పుస్తకావిష్కరణ జరిగింది. కుడ్య చిత్రాలను కాకినాడకు చెందిన చిత్రకారులు సుబ్రహ్మణ్యేశ్వరరావు నాలుగు సంవత్సరాలు పరిశోధన చేసి పుస్తక రూపంలోకి తీసుకురావడంతో వీటిని ప్రభుత్వ అనుమతితో ప్రదర్శన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటిని ఆర్కీయాలజీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పునరుజ్జీవానికి చర్యలు చేపడతామన్నారు. ఇండిగో విమాన సంస్థ సీఎస్‌ఆర్ కింద రూ. 50 లక్షల నిధులతో శ్వేతపుష్కరిణి అభివృద్ధి చేస్తోందన్నారు. ముందుగా రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ఈవో కె.నరసింహనాయుడు, ప్రముఖ శిల్పి దివిలి అప్పారావు, కోరాడ వెంకటరావు, వి.సింహాగిరి, మైగాపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.