
క్విట్ కార్పొరేట్ డే జయప్రదం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలకు నిరసనగా ఆగస్టు 13న నిర్వహించనున్న క్విట్ కార్పొరేట్ డేను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు డి.చందు, పి.ఖగేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో కరపత్రాలు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడోసారి అధికారం చేపట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దయిన 3 నల్లచట్టాల కన్నా ప్రమాదకరమైన విధానాలను ప్రకటించిందని విమర్శించారు. వ్యవసాయ మార్కెట్ల చట్టాన్ని విదేశీ, స్వదేశీ కంపెనీల ఎగుమతి, దిగుమతి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేసిందని దుయ్యబట్టారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులు కాపాడాలని, జీడి పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని కోరారు.