
బోధనోపకరణాల కిట్లు పంపిణీ
శ్రీకాకుళం అర్బన్: కొత్తూరు , పాతపట్నం, మెళియాపుట్టి, సారవకోట, పొందూరు, సంతబొమ్మాళి మండలాల్లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన బుద్ధి మాంద్యం గల విద్యార్థులకు బోధనోపకరణాలతో కూడిన కిట్లను డీఈఓ ఎస్.తిరుమల చైతన్య, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శశిభూషణ్ సమవారం అందజేశారు. జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ సుమారు రూ.12000 విలువైన ఒక్కో కిట్లో ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన, సులభతరమైన అభ్యసనకు దోహదం చేసే పరికరాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఆర్‌సీ (కాంపోజిట్ రీజినల్ సెంటర్) నెల్లూరు ద్వారా వీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్యా సమన్వయకర్త బుడుమూరు గోవిందరావు, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ వి.ఉమ, నెల్లూరు ప్రతినిధి ధర్మేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.