
‘మాతా శిశు మరణాలు తగ్గించాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మాతా,శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మాకివలస, గుత్తావిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన మాతా మరణాలతో పాటు, చొర్లంగి, గోవిందపురం, నిమ్మాడ, బైదిలాపురం కేంద్రాల్లో చోటుచేసుకున్న శిశు మరణాలపై ఆయన ఆరా తీశారు. మరణాలకు దారితీసిన ప్రాథమిక వైద్య కారణాలపై చర్చించారు. గర్భిణులకు మొదటి త్రైమాసికం నుంచే హిమోగ్లోబిన్, బీపీ, ఇతర ఆరోగ్య పరీక్షలు, ల్యాబ్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పనివేళల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ అనిత, డీపీహెచ్‌ఎన్ శైలజ, డీఐఓ రామదాస్, డెమో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.