
28న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం పేరిట ఈ నెల 28న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.తులసీదాసు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండని యువగళం పాదయాత్రలో లోకేష్ పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ ఎరువులు అందక జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయించి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజన భూములను గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నాయకులు బి.కృష్ణమూర్తి, జి.సింహాచలం, పి.తేజేశ్వరరావు, ఎన్.షణ్ముఖరావు, సీహెచ్.అమ్మన్నాయుడు, ఎస్.లక్ష్మీనారాయణ, పి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.