పాలకుల తీరుతో సర్కారు బడులకు ముప్పు
గార: ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించేలా ప్రభుత్వ ఆలోచనలున్నాయని, బాలికా విద్యకు ప్రోత్సహమంటూనే ప్రాథమికోన్నత పాఠశాలలు మూసివేసేందుకు అడుగులు పడుతున్నాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి అన్నారు. శనివారం బలరాంపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని చక్కదిద్దుతున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూ, ప్రతీ శుక్రవారం మీ అభ్యంతరాలను వినేందుకు మా అధికారులు మీ కోసం ఎదురుచూస్తున్నారని పైకి తీయని మాటలు చెబుతూనే లోలోపల పాఠశాలలను కుదించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 1256 యూపీ స్కూళ్లను ప్రైమరీగా డీగ్రేడ్ చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారని, ఆయా పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వీరంతా సమీప పాఠశాలలో చేరుతారని ఎలా చెప్పగలుగుతున్నారని, వాంతా ప్రైవేట్ బాటపట్టడానికి ప్రభుత్వమే అవకాశం కల్పించినట్లు ఉందని చెప్పారు. బాలికల డ్రాపౌట్లు తగ్గించేందుకు యూపీలు ప్రవేశపెట్టారని, మరి ఇప్పుడు బాలికల విద్యకు ప్రాధాన్యం లేదా అని ప్రశ్నించారు. పాఠశాలలను తగ్గించడం, పోస్టులను మిగిల్చడం తప్ప నిజంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని స్పష్టం చేశారు. హైస్కూల్‌తో సంబంధం లేకుండా వేరుగా మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఉండేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హెచ్‌ఎం కె.అశోక్‌కుమార్, రామకృష్ణ, నీలవేణి, విశ్వనాథం, యామిని, ప్రియదర్శిని, అలుగోలు సత్యనారాయణ పాల్గొన్నారు.


