● మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచేసిన కేసు కొలిక్కి
కాశీబుగ్గ: మహిళకు లిఫ్ట్ ఇచ్చి ఆపై బంగారు పుస్తెలతాడు దోచుకున్న కేసులో నిందితుడిని కాశీబుగ్గ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు, సీఐ సూర్యనారాయణలు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పురుషోత్తపురం కాలనీకి చెందిన బంగారుబండి ప్రదీప్ ఈనెల 12వ తేదీన పలాస కిడ్నీ ఆస్పత్రి వద్ద ఆటో కోసం వేచి ఉన్న దుంపల యశోదకు తన ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చాడు. ఆమె కోసంగిపురం కూడలి వద్ద దింపమని కోరుతుండగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆపి ఆమెను బంగారు పుస్తెలతాడును ఇవ్వమని కత్తితో బెదిరించాడు. కానీ ఆమె ఇవ్వకపోవడంతో తెంచుకొని తన ద్విచక్ర వాహనంపై పారిపోయాడు.
బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని
విశాఖపట్నంలో ఐటీఐ చదువుకున్న నిందితుడు చదువుమానేసి ఖాళీగా ఇంటివద్ద సెల్‌ఫోన్‌తో కాలం గడుపుతున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో అధిక సంపాదనకు ఆశపడి తన తల్లి ఖాతా నుంచి రూ.1.10 లక్షలు పోగొట్టుకున్నాడు. అవి తిరిగి రాకపోవడంతో చేసేదేమీలేక ఎలాగైనా తల్లికి తెలియకుండా డబ్బులు తిరిగి ఖాతాలో వేయాలని ఆలోచించాడు. దీనిలో భాగంగా బంగారం చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన బంగారం పలాస రైల్వే కాలనీలో ఉన్నటువంటి తన బాబాయి రోశవ కిరణ్‌కుమార్ ఇంటికి వెళ్లి అమ్మమని చెప్పాడు. దీంతో సమీపంలోని రెల్లివీధిలో ఉన్న బంగారు వర్తకుడు పవర్ రంజిత్‌కు అమ్మారు. వచ్చిన డబ్బులో తన బాబాయి రూ.27 వేలు ఉంచుకొని, నిందితుడికి రూ.1.50 లక్షలు ఇచ్చాడు. అయితే బెట్టింగ్ యాప్‌లతో పాటు ఇతర ఖర్చులకు డబ్బులు సరిపోవని తన బాబాయి వద్ద రూ.10 వేలు కావాలని అడగడానికి వస్తుండగా, ప్రదీప్‌ను కాశీబుగ్గ పోలీసులు అక్కుపల్లి జంక్షన్ వద్ద స్కూటీ నంబర్ ఏపీ39డీబీ9839 గుర్తించి పట్టుకొని అరెస్టు చేశారు.