రణస్థలం: మండలంలోని కోష్ట ఫ్లై ఓవర్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో భిక్షాటన చేసుకుంటా రోడ్లుపై తిరుగుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 63099 90850, 6309990816 నంబర్లకు తెలియజేయాలని కోరారు.
చైన్నెలో వలస
మత్స్యకారుడు మృతి
సోంపేట: మండలంలోని ఇస్కలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు సీరాపు శ్యాంసుందరరావు(38) చైన్నెలో చేపల వేట సాగిస్తూ మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..శ్యాంసుందరరావు నెల రోజుల కిందట చైన్నె వలస వెళ్లాడు. సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు బోటు బోల్తాపడటంతో శుక్రవారం మృతి చెందాడు. శ్యాంసుందరరావుకు భార్య భానుమతి, కుమారుడు కుమారస్వామి ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
లిఫ్ట్ ఇస్తానని చెప్పి..
టెక్కలి రూరల్: మండలంలోని మోదుగువలస గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలు బైక్ పైనుంచి పడి తీవ్రగాయాలకు గురైన విషయం తెలిసిందే. అయితే బాధితురాలు ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గ్రామం వద్ద రోడ్డుపై నిల్చుని ఉండగా పక్క గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడని, టెక్కలి జిల్లా ఆసుపత్రికని చెప్పడంతో తానూ అక్కడికే వెలుతున్నానంటూ బైక్ ఎక్కించుకున్నాడని పేర్కొంది. మార్గమధ్యలో గూడేం వైపు తీసుకెళ్తుండటంతో ఆపమని చెప్పినా వినలేదని, అందుకే గెంతేశానని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి