మార్కులు..మార్పులు! | - | Sakshi
Sakshi News home page

మార్కులు..మార్పులు!

Jan 4 2026 11:11 AM | Updated on Jan 4 2026 11:11 AM

మార్క

మార్కులు..మార్పులు!

మార్కులు..మార్పులు! అవగాహన కల్పిస్తున్నాం..

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణల్లో భాగంగా ఇంటర్మీడియెట్‌ విద్యామండలి అధికారులు ఈ ఏడాది నుంచి ఫస్టియర్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు అమలవుతున్న ఆరు పేపర్ల విధానానికి బదులు ఐదు పేపర్లకు కుదించారు. మ్యాథ్స్‌, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల ప్రశ్నపత్రాల్లో మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రం సైతం మార్పు చేశారు. అయితే ఈ విషయమై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రిన్సిపాళ్లకు, సీనియర్‌ లెక్చరర్లకు బోర్డు అధికారులు పరీక్షల పేట్రన్‌పై అవగాహన కల్పించి మమ అనిపించారని, పరీక్షల తీరుతెన్నులపై విద్యార్థులకు మాత్రం అవగాహన కల్పించలేదని సమాచారం. సెకెండియర్‌ విద్యార్థులకు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పేట్రన్‌ అమలుచేయనున్నారు.

39,733 మంది విద్యార్థులు..

జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 39,733 మంది చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 19,825 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 19,908 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. సర్కారీ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రభుత్వం ‘సంకల్ప్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతర్గత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడ్‌లుగా విభిజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ఒకే పేపర్‌గా..

ప్రథమ సంవత్సరం పరీక్షల విధానం, సబ్జెక్టులవారీగా పేపర్లకు మార్కుల కేటాయింపుల్లో కీలక మార్పులు చేశారు. ఎంపీసీ గ్రూపును 500 మార్కులగా నిర్ణయించారు. రాత పరీక్షలకు 470 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు (ఫిజిక్స్‌15, కెమిస్ట్రీ15 చొప్పున) కేటాయిస్తున్నారు,.

● ఇప్పటివరకు మ్యాథ్స్‌ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. పేపర్‌–1ఏకు 75 మార్కులు, పేపర్‌–2ఏకు 75 మార్కులు కలిపి 150 మార్కులకు పరీక్షలు జరిగేవి. ఇకపై మొదటి సంవత్సరంలో 100 మార్కులకు ఒకటే మ్యాథ్స్‌ పేపర్‌ ఉంటుంది. పాస్‌ మార్కులు 35గా నిర్ణయించారు.

● గతంలో ఫిజిక్స్‌ 60 మార్కులు, కెమిస్ట్రీ 60 మార్కులకు ప్రశ్నపత్రం ఉండేది. వాటి స్థానంలో ఈ రెండు సబ్జెక్టులు ఒక్కొక్క పేపర్‌ 85 మార్కులకు మార్పు చేశారు. వీటితో పాటు రెండు లాంగ్వేజి సబ్జెక్టులు ఒక్కొక్కటి వంద మార్కులకు ఉంటుంది.

కొత్తగా బయాలజీ పేపర్‌..

బైపీసీ గ్రూపునకు సంబంధించి 500 మార్కులగా నిర్ణయించారు. ఇందులో రాత పరీక్షలకు 455 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 45 మార్కులు (ఫిజిక్స్‌ 15, కెమిస్ట్రీ15, బోటనీ, జువాలజీతో కలబోసిన బయాలజీ 15 మార్కులు)గా కేటాయించారు.

● ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు సబ్జెక్టులు కలిపి 85 మార్కులకు ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. ఇందులో బోటనీకి 43 మార్కులు, జువాలజీకి 42 మార్కులు నిర్దేశించారు. మూల్యాంకనానికి వీలుగా జవాబు పత్రాలు మాత్రం వేర్వేరుగా ఇవ్వనున్నారు. గతంలో బోటనీ 60 మార్కులు, జువాలజీ 60 మార్కులకు ఉండేవి.

● విద్యార్థులు రెండు జవాబు పత్రాల్లో బోటనీ, జువాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. బయాలజీలో ఉత్తీర్ణత 29.5 మార్కులుగా నిర్ధారించారు. కానీ అరమార్కు ఉండదు కాబట్టి 29 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టు పరిగణిస్తారు.

● 2025–26 విద్యా సంవత్సరంలో నూతన విధానంలో పరీక్షలు రాసిన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో సెకెండియర్‌లోనూ ఇలాగే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సెకండియర్‌ పరీక్షలు రాయబోయే విద్యార్థులు మాత్రం పాత విధానంలోనే పరీక్షలు రాస్తారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో పలు సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించాం. విద్యార్థులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– రేగ సురేష్‌కుమార్‌,

డీవీఈఓ/ఆర్‌ఐఓ ఇంటర్మీడియెట్‌ బోర్డు,

శ్రీకాకుళం

ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు

ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీ పరీక్షల్లో ఐదు పేపర్లే..

విద్యార్థులకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించని ప్రభుత్వం

మార్కులు..మార్పులు!1
1/1

మార్కులు..మార్పులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement