ఫార్మా పరిశ్రమలో ఉద్యోగాలకు శిక్షణ

మాట్లాడుతున్న యు.ఎన్‌.బి.రాజు  - Sakshi

రణస్థలం: ఫార్మా పరిశ్రమలో ఉద్యోగాలు పొందేందుకు ఎమ్మెస్సీ చదివిన విద్యార్థులకు ఉచితంగా నాలుగు నెలలు శిక్షణ ఇస్తున్నామని అరబిందో కార్పొరేట్‌ హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యు.ఎన్‌.బి.రాజు తెలిపారు. రణస్థలం మండలంలోని వరిసాం సమీపంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నాలుగు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ఎనిమిదో బ్యాచ్‌కు చెందిన 40 మంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ సర్టిఫికెట్లను బుధవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెస్సీ చదివి ఎంపిక కాబడిన విద్యార్థులకు ఫార్మాసిటికాల్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలైటికల్‌ టెక్నిక్స్‌ శిక్షణను నాలుగు నెలలు పాటు ఇవ్వడం జరిగిందన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే, అధునాతన యంత్రాలతో ఫార్మా, కెమికల్స్‌కు అవసరమైన శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో యూనిట్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ కమలాకర్‌రెడ్డి ఉన్నారు.

కల్యాణం..కమనీయం

టెక్కలి: మండలంలోని రావివలసలో బుధవా రం ఎండల మల్లికార్జునస్వామి వార్షిక కల్యా ణం కమనీయంగా జరిగింది. ఆలయ కార్య నిర్వాహణాధికారి వి.వి.ఎస్‌.నారాయణ నేతృత్వంలో అర్చకులు రామకృష్ణ, యుగంధర్‌, వేద పండితులు ఆధ్వర్యంలో ముందుగా ఉత్సవమూర్తులతో తిరువీధి నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎస్‌.బాలకృష్ణ, ఆలయ మాజీ కమిటీ చైర్మన్‌ ఎస్‌.సుధాకర్‌ పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలు

పరిష్కరించాలి

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలని ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి అన్నా రు. ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమాయ్యయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల ని తమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందన్నారు. ఇటీవల రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈనెల ఐదో తేదీన సమ్మె నోటీసు అందజేసినట్టు చెప్పారు. సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కారిమి రాజేశ్వరరావు, కూన వెంకట సత్యనారాయణ, రామారావు, కిల్లారి నారాయణరావు, జయమ్మ పాల్గొన్నారు.

31న మణినాగేశ్వరస్వామి కల్యాణ ఉత్సవం

శ్రీకాకుళం రూరల్‌: కళ్లేపల్లి గ్రామంలో వెలసిన గౌరీ సమేత మణి నాగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలను ఈనెల 31న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి సూర్యనారాయణమూర్తి, కార్యనిర్వాహణాధికారి పొన్నాడ శ్యామలరావులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఆరు గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఎనిమిది గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు అన్నదానం, సాయంత్రం ఐదు గంటలకు కల్యాణ మూర్తుల తిరువీధి ఉంటుందన్నారు.

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top