సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

గుంతకల్లు: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం దక్షిణ తూర్పు రైల్వే ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. ఈమేరకు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చి నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం వరకు నడుపుతున్నారు. రైలు నంబర్‌ 08031 సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌ నుంచి ఈ నెల 17, 24వ తేదీల్లో మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు నంబర్‌ 08032 ఈనెల 18, 25వ తేదీల్లో ఉదయం 8 గంటలకు ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11 గంటలకు సంత్రాగచ్చికు చేరుతుంద న్నారు. ఈ రైలు ఖరగ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, కటక్‌, భువనేశ్వర్‌, ఖుర్దారోడ్‌, బ్రహ్మపూర్‌, పలాస,విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్‌, గుత్తి, అనంతపురం, ధర్మవరం మీదుగా ప్రయాణిస్తుంది.

నీటి ఎద్దడి తలెత్తనీయొద్దు

● కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌

ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరిగేషన్‌, డ్వామా అధికారులతో సమీక్షించారు. నీటి నిల్వలు, నీటి ఎద్దడి నివారణ చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులకు సంబంధించి రెండు రోజుల్లో ప్రణాళికలు రూపొందించి ఆమోదింపజేసుకోవాలని, నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, కుంటల నిర్వహణ, మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జలహారతి 2.0లో భాగంగా కేటాయించిన జల సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పూడికతీత, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ఇంకుడు గుంతలు వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

మోగిన ‘రెండో విడత’ నగారా

ప్రశాంతి నిలయం: రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాలో రెండో విడతలో కదిరి, పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా డివిజన్లలో 12 మండలాల పరిధిలోని 169 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..

రేపు(బుధవారం) ఎన్నికల నోటిఫికేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి విడుదల చేస్తారు. అదే రోజు నుంచి 20వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22న అభ్యంతరాల స్వీకరణ, 23న అభ్యంతరాల పరిశీలన, 24న సాయంత్రం 3 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 24 సాయంత్రం 3 గంటల తరువాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌, మధ్యాహ్నం 2 గంటల తరువాత ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. అవసరమైన చోట 30న రీపోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

వాలీబాల్‌ రాష్ట్ర జట్టుకు ఎంపిక

తాడిమర్రి: వాలీబాల్‌ రాష్ట్ర జట్టుకు తాడిమర్రి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి ఎంపికయ్యాడు. ప్రిన్సిపాల్‌ అరుణ తెలిపిన మేరకు.. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి.గోవర్ధన్‌కు వ్యాయామ టీచర్‌ అమరాంజినేయులు వాలీబాల్‌ ఆటపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ఎంపికై న గోవర్ధన్‌ ఇటీవల అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ఆటతీరు కనబరిచాడు. వాలీబాల్‌ రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 23 నుంచి మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొననున్నట్లు పీడీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement