ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా ‘‘లవ్ ఆల్ సర్వ్ ఆల్’’ స్ఫూర్తి నేడు ప్రపంచ నలుమూలలా ప్రతిధ్వనిస్తోందని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు పేర్కొన్నారు. సత్యసాయి శత వర్ష జయంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ప్రశాంతి నిలయంలోని మీడియా సెంటర్‌లో సత్యసాయి సేవా సంస్థల బృందంతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రత్నాకర్ రాజు మాట్లాడుతూ సత్యసాయి నిర్యాణం అనంతరం ట్రస్ట్, సేవల కొనసాగింపుపై మొదలైన అపోహలు కొన్నాళ్లకే తొలగిపోయాయన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది శత జయంతి వేడుకలు అత్యంత వైభవంగా పూర్తి చేసుకున్నామన్నారు. నేడు భక్తులలో సత్యసాయి ఆశయాల కొనసాగింపుపై గట్టి నమ్మకం ఏర్పడిందన్నారు. సత్యసాయి ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. సత్యసాయి వైద్య సంస్థల్లో ఉచితంగా ఖరీదైన రోబోటిక్ సర్జరీలు అందుతున్నాయని, ఇలాంటి నాణ్యమైన వైద్యం ప్రపంచంలో ఎక్కడా అందుతున్న దాఖలాలు లేవన్నారు. పుట్టపర్తి యాత్రకు రావాలన్న ఆకాంక్ష దేశ విదేశాల భక్తుల్లో రోజురోజుకూ పెరుగుతోందన్నారు. అభాగ్యులకు కుల, మతం, ప్రాంతం అన్న తేడాలు లేకుండా సత్యసాయి సేవా సంస్థల ద్వారా సేవలు అందుతున్నాయన్నారు. సత్యసాయి విద్యాసంస్థలు విలువలతో కూడిన విద్యను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ శత సంవత్సర వేడుకలలో భాగంగా సత్యసాయి సేవలపై విస్తృతంగా చర్చించి మరింత బలోపేతం చేసేందుకు జాతీయ సదస్సును రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. శత వర్ష జయంతి వేడుకలను ఈ నెల 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తుల సౌకర్యార్థం ప్రశాంతి నిలయంలో నారాయణ సేవ (మూడు పూటలా అన్న ప్రసాద వితరణ) ఉంటుందన్నారు. కార్యక్రమంలో మీడియా సెంటర్ డైరెక్టర్ సుందర్ స్వామినాథన్, సేవా సంస్థల జాతీయ సేవా కోఆర్డినేటర్ ఎస్.కోటేశ్వరరావు, రాష్ట్ర సేవా సంస్థల అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు, జాతీయ సేవా సంస్థల జాయింట్ కో ఆర్డినేటర్ ఎస్‌ఆర్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.
● అంతకుమందు ప్రశాంతి నిలయంలోని ఉత్తర మైదానంలో ‘నారాయణ సేవ’ను ఆర్‌జే రత్నాకర్ రాజు ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.
సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ
ఆర్‌జే రత్నాకర్ రాజు
శత సంవత్సర వేడుకలకు
అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి


