పుట్టపర్తి టౌన్: ‘ఇసుక తోడేళ్ల’ ఆటకు చెక్ పడింది. పుట్టపర్తి సమీపంలో ఉన్న చిత్రావతి నదిలో కొన్ని రోజులుగా కొందరు కూటమి నాయకులు ఇసుక దందా సాగిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అనుమతులు ఉన్నాయని చెప్పుకుంటూ రాత్రింబవళ్లు జేసీబీలు, హిటాచీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఈ నెల 14న ‘చిత్రావతి నదిలో ఇసుక తోడేళ్లు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలోనే స్పందించిన ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మళ్లీ ఇసుక తోడేళ్లు చిత్రావతిలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. దుర్గమ్మ గుడి వద్ద పాత రహదారుల్లో జేసీబీ సాయంతో ట్రెంచ్‌లు తీయించారు. చిత్రావతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, అప్పటివరకూ ఇసుక తవ్వుతున్న ఇసుకాసురులు అధికారుల రాకను గమనించి పరుగులు తీయడం గమనార్హం.


