ధర్మవరం/కనగానపల్లి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి తెరలేచింది. పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. తొలి విడతలో ఎన్నికలు జరగనున్న 114 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆదివారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. సర్పంచ్ స్థానాలకు 193 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 229 నామినేషన్లు కలిపి మొత్తం 422 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రానున్న రెండురోజుల్లో ఎన్నికల వేడి మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం పది గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 17వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. అయితే తొలిరోజు డివిజన్ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. ధర్మవరం మండలంలో 20 పంచాయతీలకు 5 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా... సర్పంచ్ స్థానాలకు మొత్తం 39 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 42 మంది నామినేషన్లు వేశారు. ముదిగుబ్బ మండలానికి సంబంధించి 25 పంచాయతీలకు గానూ ఎనిమిది నామినేషన్ కేంద్రాల్లో సర్పంచ్ స్థానాలకు 35 మంది, వార్డు మెంబర్ స్థానాలకు 31 మంది, బత్తలపల్లి మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు నాలుగు నామినేషన్ కేంద్రాల్లో సర్పంచ్ స్థానాలకు 24 మంది, వార్డు మెంబర్ స్థానాలకు 23 మంది, తాడిమర్రి మండలంలో 14 సర్పంచ్ స్థానాలకు 11 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే కనగానపల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా తొలిరోజు 14 పంచాయతీల్లో మొత్తం 75 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ స్థానాలకు 34 నామినేషన్లు, వార్డు మెంబర్ స్థానాలకు 41 నామినేషన్లు వచ్చాయి. చెన్నేకొత్తపల్లి మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా 12 గ్రామ పంచాయతీల పరిఽధిలో 59 మంది నామినేషన్లు వేశారు. ఇందులో సర్పంచ్ స్థానాలకు 31, వార్డు మెంబర్ స్థానాలకు 28 నామినేషన్లు దాఖలయ్యాయి. రామగిరి మండలంలో 9 గ్రామ పంచాయతీలు ఉండగా తొలిరోజు 8 పంచాయతీల్లో 80 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 19 సర్పంచ్ స్థానాలకు, 61 వార్డు మెంబర్ల స్థానాలకు నామినేషన్లు వేశారు.
సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు తొలిరోజున ఉత్సాహం చూపకపోవడంతో మందకొడిగా సాగింది. నామినేషన్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఉదయం నుంచే వేచి ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కొంతమేర ఊపందుకున్నాయి. సోమవారం చాలామందికి సెంటిమెంట్ కావడం, దినం కూడా బాగుండటంతో ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందంటున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తొలిరోజు మందకొడిగా
నామినేషన్ల ప్రక్రియ
సర్పంచ్ స్థానాలకు 193, వార్డు స్థానాలకు 229 నామినేషన్లు దాఖలు
నేడు భారీగా దాఖలయ్యే అవకాశం
నేడు పుంజుకునే అవకాశం
తొలిరోజు 422 నామినేషన్లు దాఖలు


