గుంతకల్లు: పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లు (ఒకసారి వెళ్లి వచ్చేవి) నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. శ్రీకాకుళం రోడ్డు–యలహంక, యలహంక–విజయవాడ మధ్య నడుస్తాయని వెల్లడించింది. 08555 నంబరు గల రైలు శ్రీకాకుళం రోడ్డు నుంచి ఈ నెల 20వ తేదీ (శుక్రవారం) సాయంత్రం 4.00 గంటలకు బయలుదేరి..మరుసటి రోజు (శనివారం) మధ్యాహ్నం యలహంక రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (రైలు నంబర్ 08556) 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు యలహంక నుంచి బయలుదేరి.. 25వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. ఈ రైలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, గాజులదిన్నె, నంద్యాల, డోన్, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే రైలు నంబర్ 07246 ఈ నెల 21న (శనివారం) సాయంత్రం ఐదు గంటలకు యలహంక నుంచి బయలుదేరి, మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 7.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (రైలు నంబర్ 07245) ఈ నెల 23న రాత్రి 11.50 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి... మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు యలహంక చేరుకుంటుంది. ఈ రైలు సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి), ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, డోన్, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లలో టూటైర్ ఏసీ రెండు కోచ్‌లు, త్రీటైర్ ఏసీ 4, స్లీపర్ కోచ్‌లు 7, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు నాలుగు ఉంటాయి.
అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు
బత్తలపల్లి: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ అంకిత సురానా సందర్శించారు. ఆదివారం మండలంలోని దంపెట్ల, రామాపురం, అప్పరాచెరువు, బత్తలపల్లి నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ల సమయంలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు, ప్రతిపాదకులు ఎన్నికల నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. ఆమె వెంట డీఎస్పీలు రవిబాబు, శ్రీనివాసులు, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.


