కరువు రైతుకు సాయం ఏదీ..? | - | Sakshi
Sakshi News home page

కరువు రైతుకు సాయం ఏదీ..?

Nov 16 2026 1:14 AM | Updated on Nov 16 2026 1:14 AM

● ఎల్‌–నినో పేరుతో

చంద్రబాబు సర్కారు కాలయాపన

అనంతపురం అగ్రికల్చర్‌: కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు.. రైతులు, ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత. అయితే చంద్రబాబు సర్కారు కరువు సాయం అందించకుండా కాలయాపన చేయడానికి ‘ఎల్‌–నినో’ను ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. తీవ్ర వర్షాభావంతో కరువు తాండవం చేస్తోంది. ఇదే తరుణంలో వ్యాపార వర్గాలు, వాణిజ్య కంపెనీలు పప్పు, ఉప్పు నుంచి అన్ని రకాల వస్తువులు, నిత్యావసర సరుకుల ధరలు పెంచేశాయి. ధరల నియంత్రణపై ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలూ లేవు. రాష్ట్రంలో కరువు మండలాల జాబితా ప్రకటించారు. అయితే కరువు కోరల్లో చిక్కి పంటలు దక్కక.. పెట్టుబడులు కోల్పోయిన అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇంతవరకూ చొరవ చూపలేదు. ఎల్‌–నినో ప్రభావం ఏదో కొత్తగా, తొలిసారిగా చూస్తున్నట్టు ప్రభుత్వం ఐదారు నెలలుగా విస్తృత ప్రచారంతో హడావుడి చేస్తోంది. జిల్లాలోని కరువు పీడిత రైతులు మాత్రం ప్రభుత్వ సాయం అందిస్తే కొంతైనా ఆర్థికంగా ఉపశమనం పొందవచ్చనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు.

ఎల్‌–నినో కొత్తేమీ కాదు..

పసిఫిక్‌ మహాసముద్రంలో జరిగే వాతావరణ మార్పులకు అనుగుణంగా అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగితే ‘ఎల్‌–నినో’ ఏర్పడటం, శీతల వాతావరణం ఉంటే ‘లా–నినో’ ఏర్పడటం సర్వసాధారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ‘ఎల్‌–నినో’ తీవ్రతను బట్టి వర్షాలు తగ్గుముఖం పట్టడం, అలాగే ‘లా–నినో’ వల్ల మంచి వర్షాలు కురుస్తాయని చెబుతారు. సగటున రెండు మూడేళ్లకోసారి ఎల్‌–నినో లేదా లా–నినో ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా 1950 తర్వాత నుంచి ఇప్పటి వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే... 28 సార్లు ‘ఎల్‌–నినో’ సంభవించగా... 25 సార్లు ‘లా–నినో’ ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఎల్‌–నినో ఏర్పడిన 28 సంవత్సరాల్లో 12 సార్లు బలహీనంగా ఉండగా... ఏడు సార్లు మధ్యస్థంగానూ, ఆరు సార్లు బలంగానూ... మూడుసార్లు చాలా బలంగా ప్రభావం చూపినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు సర్కారు ‘ఎల్‌–నినో’ జపం వీడి.. కరువు ఉపశమన చర్యలు చేపట్టడంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

రాత్రికి రాత్రే మిర్చి పంట మాయం

● లబోదిబోమంటున్న రైతు ఎర్రమ్మ

కళ్యాణదుర్గం రూరల్‌: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట చేతికొచ్చిన సమయంలో దొంగలు కోసుకెళ్లడంతో బాధిత మహిళా రైతు ఎర్రమ్మ లబోదిబోమంటున్నారు. బెళుగుప్ప మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన రైతు ఎర్రమ్మ రెండెకరాల్లో రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి మిర్చి పంట సాగు చేసింది. పంట చేతికొచ్చింది.. కోత పెట్టే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే పంటను ఖాళీ చేశారు. ఆదివారం ఉదయం తోట వద్దకు వెళ్లి చూడగా మిర్చి దంట్లు తప్ప.. మిర్చి (మిరప కాయలు) కనిపించలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు పంటను దోచుకెళ్లారని బాధితురాలు కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. దాదాపుగా రూ.5 లక్షలు నష్టపోయానని బాధితురాలు బోరున విలపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement