పాత్రికేయులపై ఎస్‌ఐ దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

పాత్రికేయులపై ఎస్‌ఐ దౌర్జన్యం

Nov 16 2026 1:14 AM | Updated on Nov 16 2026 1:14 AM

బత్తలపల్లి: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న పాత్రికేయులపై ఖాకీల దౌర్జన్యం మితిమీరుతోంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై వీరంగం సృష్టించిన ఘటన బత్తలపల్లిలో కలకలం రేపింది. వివరాలు.. ఆదివారం బత్తలపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్‌ ప్రక్రియను కవర్‌ చేసేందుకు స్థానిక పాత్రికేయులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ బందోబస్తు నిమిత్తం విధులు నిర్వహిస్తున్న రొద్దం ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప విలేకరులను చూసి కనీస సంస్కారం లేకుండా ‘మీరు ఇక్కడ ఉండకూడదు, బయటకు వెళ్లండి. వంద మీటర్లు దూరంలో ఉండాలి’ అంటూ వారిపైకి దూసుకెళ్లారు. సార్‌.. మేం వెళ్లిపోతాం అని చెప్పే ప్రయత్నం చేసినా ఆయన ఏమాత్రం తగ్గలేదు. బయట జరుగుతున్న గందరగోళాన్ని గమనించిన ఎంపీడీఓ క్రిష్టప్ప ఆవరణలో ఉండనివ్వండి అని ఎస్‌ఐకి సూచించినా ఆయన ఖాతరు చేయలేదు. మీ రూల్స్‌ మీకు ఉంటే.. మా రూల్స్‌ మాకుంటాయంటూ అధికారిని సైతం వారించారు. విలేకరుల భుజాలపై చేతులు వేసి నెట్టుకుంటూ రోడ్డుపైకి తోసేశారు. ఏం సార్‌ మేం.. నేరస్తులమా, రౌడీలమా.. ఎందుకు ఇలా చేస్తున్నారు అని విన్నవించుకున్నా ఆయన మనసు కరగలేదు. పైగా తన హోదాను అడ్డుపెట్టుకొని నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోయారు. ‘నేను రొద్దం ఎస్‌ఐని.. మీకు చేతనైంది రాసుకోండి.. నాకేమవుతుంది’ అని చిందులు తొక్కారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేలా నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండేందుకే ఎస్‌ఐ ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

నామినేషన్ల ప్రక్రియను కవర్‌

చేసేందుకు వెళ్లిన వారిపై చిందులు

ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప తీరును ఖండించిన జర్నలిస్టు సంఘాలు

ఖండించిన ఏపీయూడబ్ల్యూజే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement