పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నదిలో రాత్రింబవళ్లు ఇసుక దందా కొనసాగుతోంది. ఇరిగేషన్ అధికారి నుంచి అనుమతులు తీసుకున్నామని చెబుతున్న కొందరు... హిటాచీ, జేసీబీ యంత్రాలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. హిటాచీలతో తవ్వకాలకు అనుమతులు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. అయినా రోజుకు 50 ట్రాక్టర్లు చొప్పున ఇసుక
తోలుకునేందుకు అధికారులే అనుమతులు ఇచ్చారని ఇసుకాసురులు చెబుతున్నారు.
ఆ అనుమతులు అడ్డం పెట్టుకుని రోజూ
వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
సాక్షి, పుట్టపర్తి
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే...మూడు పార్టీల నాయకులూ అడ్డగోలు దోపిడీకి తెగబడ్డారు. దందాలు, దౌర్జన్యాలతో కొందరు భారీగా దోచేస్తుండగా.. మరికొందరు మాత్రం సహజవనరుల దోపిడీకి సిద్ధమయ్యారు. ఇసుకను పిండి కాసులు కురిపించుకుంటున్నారు. వీరి ధనదాహానికి నదులన్నీ రూపురేఖలు కోల్పోతుండగా...భూగర్భజలమట్టం భారీగా పడిపోతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అంతంతమాత్రంగానే ఉన్న భూగర్భజలం ఇసుక తవ్వకాలతో మరింత లోతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో చాలా ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. ఇవేమీ పట్టించుకోని కూటమి నేతలు సంపాదనే ధ్యేయంగా ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు.
కర్ణాటకకు తరలించి..
జిల్లా వ్యాప్తంగా ఇసుక దందా జోరుగా సాగుతోంది. చిత్రావతి, పెన్నా, కుముద్వతి, జయమంగళి నదుల్లో జేసీబీ యంత్రాలతో ఇసుక తోడేస్తూ.. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా పొరుగు రాష్ట్రం కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు. పట్టపగలే నగర నడిబొడ్డున ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుకాసురులంతా కూటమి పార్టీల ఎమ్మెల్యేల అనుచరులే కావడంతో అధికారులు ‘మామూలు’గానే పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వర్షాలకు మేటలు..
ఇటీవల అరకొర కురిసిన వర్షాలకు నదుల్లో ఇసుక మేటలు వేసింది. దీంతో ఇసుకాసురులు రంగంలోకి దిగారు. పుట్టపర్తి, గోరంట్ల, చిలమత్తూరు, పరిగి, రొద్దం, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల పరిధిలోని చిత్రావతి, కుముద్వతి, పెన్నా నదుల నుంచి ఇసుక తవ్వి రాత్రి వేళల్లో టిప్పర్లలో కర్ణాటకకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ (18 టన్నులు) ఇసుక కర్ణాటకలో రూ.50 వేల వరకు ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఖర్చు రూ.10 వేలు కూడా దాటదు. రవాణా ఖర్చు మరో రూ.10 వేల వరకు ఉండవచ్చు. మిగతా మొత్తం కూటమి నేతల జేబుల్లోకి వెళ్తోన్నట్లు తెలిసింది.
అనుమతులు లేకున్నా..
పీసీ రేవు, సీసీ రేవుల వద్ద మాత్రమే ప్రభుత్వం ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. ఎవరికి ఇసుక అవసరమైనా ఆ రెండు రీచ్‌ల నుంచే ఇసుకను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ప్రవహించే అన్ని నదుల్లోనూ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పార్టీల నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దందా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినప్పుడు మాత్రం మరీ అడపాదడపా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు.
మంత్రుల ఇలాకాల్లోనే అధికం..
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లోనే ఇసుక దందా ఎక్కువగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని చిత్రావతి నది నుంచి ఇసుకను తవ్వి టిప్పర్ల ద్వారా కర్ణాటకకు తరలిస్తున్నారు. ఎవరైనా అధికారి ఇసుక వాహనాలను అడ్డగిస్తే వెంటనే మంత్రి అనుచరుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
పుట్టపర్తిలో విచ్చలవిడిగా..
జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలోని చిత్రావతిలో రాత్రింబవళ్లు ఇసుక దందా జరుగుతోంది. ఏకంగా హిటాచీల ద్వారా ఇసుకను తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు వాహనాలను ఆపితే వెంటనే టీడీపికి చెందిన ఓ మాజీ మంత్రి నుంచి సిఫారసులు వెళ్తున్నాయి.. దీంతో అడ్డుకోవడమే మానేశారు.
నదులను తూర్పారబడుతున్న
‘కూటమి’ నేతలు
సిండికేటుగా మారి
విచ్చలవిడిగా దందా
తూతూ మంత్రంగా అనుమతులు..
ఇష్టారాజ్యంగా తవ్వకాలు
పుట్టపర్తి, గోరంట్ల, హిందూపురం, రొద్దం, పరిగి నుంచి భారీగా రవాణా


