● ఏపీఎంఐపీ అధికారుల తీరుపై
కలెక్టర్ అసంతృప్తి
● జిల్లాలో సూక్ష్మసాగు లక్ష్యాల్లో
వెనుకబడ్డారని ఆగ్రహం
ప్రశాంతి నిలయం: ‘‘ప్రతిశాఖకు కేటాయించిన లక్ష్యాలు చేరుకోవాలి. అప్పుడే అన్నింటా జిల్లా అగ్రస్థానంలో నిలుస్తుంది. తద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది. జిల్లాలో 19,950 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం సాగయ్యేలా చూడాలని ఏపీఎంఐపీకి లక్ష్యాన్ని విధించాం. కానీ ఇప్పటి వరకూ 4,282 హెక్టార్లకు మాత్రమే పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. దీన్నిబట్టే మీ పనితీరు తెలుస్తోంది’’ అంటూ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) అధికారులపై కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సూక్ష్మ సేద్య పరికరాల కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పరికరాల పంపిణీ పురోగతిని సమీక్షించారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి జిల్లాకు తొలుత 12,100 హెక్టార్ల లక్ష్యంకాగా, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా ఆ లక్ష్యాన్ని 20,000 హెక్టార్లకు పెంచారన్నారు. పరికరాలు పంపిణీ చేసేందుకు 34 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటి వరకు 4,282 హెక్టార్లు మాత్రమే పరిపాలనా అనుమతులు జారీ చేశారని, 3,032 హెక్లార్లకు మాత్రమే డ్రిప్ పరికరాలు సరఫరా చేశారన్నారు. సూక్ష్మ సేద్యం అమలు పురోగతి ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్యాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ దేవానంద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్‌రెడ్డి, సూక్ష్మ సాగు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
● కలెక్టర్ శ్యాం ప్రసాద్
ప్రశాంతి నిలయం: అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, నిల్వ ఉంచినా
కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక నిల్వలపై కలెక్టర్, జేసీ ఆరా తీశారు. ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలు, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. జిల్లాలో జీవనదులు లేనందున వాగుల్లో లభించే ఇసుకను స్థానికుల గృహనిర్మాణ అవసరాలకు ఉచితంగా అందించాలని నిర్ణయించారు. అయితే వాణిజ్య, ప్రభుత్వ పనుల కోసం తాడిమర్రి మండలం సీసీ రేవు సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన డీ–సిల్టేషన్ ద్వారా ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించారు. టన్ను ఇసుక ధర రూ.158గా ఖరారు చేస్తూ డీఎల్‌ఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. ఇసుక ధర విషయంలో తేడా వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


