ప్రశాంతి నిలయం: బాలికా సాధికారత సాధ్యమైనప్పుడు అభివృద్ధికి పునాది పడుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కదిరిలోని ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కదిరి ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల సహకారంతో ఈ ఏడాది సెప్టెంబర్ 29న జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం రెవెన్యూ భవన్‌లో బహుమతులు అందజేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. బాలికా విద్య, ఆరోగ్యం, భద్రత, గౌరవం, లింగ సమానత్వంపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించేందుకే లఘు చిత్రాల పోటీలు నిర్వహించామన్నారు. పోటీల్లో కదిరి ఎస్‌టీఎస్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హిందూపురం ఎస్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, మడకశిర ఎస్‌వైటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బుక్కపట్నం ఎస్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని తమ లఘు చిత్రాలను ప్రదర్శించారు.
‘సేవ్‌ది గర్ల్ చైల్డ్’కు ప్రథమ బహుమతి
లఘు చిత్రాల్లో కదిరి ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎస్. బాషా రూపొందించిన ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’కు ప్రథమ బహుమతి దక్కింది. అలాగే హిందూపురం ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల చెందిన ఎన్.గౌతమి రూపొందించిన ‘బాలికల అక్రమ రవాణా’ అనే చిత్రానికి ద్వితీయ బహుమతి, మడకశిర ఎస్‌వైటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెందిన పి.రజియా భాను రూపొందించిన ‘ఆన్‌లైన్ సైబర్ నేరాలు’ అనే లఘు చిత్రానికి తృతీయ బహుమతి దక్కింది. విజేతలకు వరసుగా రూ.30 లు, రూ.20 వేలు, రూ.10 వేలను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం, డాక్టర్ మహేశ్వర మారుతి, సీడీపీఓ జయంతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


