మడకశిర: జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇప్పటికే ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జిల్లాలోని 467 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలి విడత 26న ధర్మవరం, రెండో విడత ఈనెల 29న కదిరి, పుట్టపర్తి, మూడో విడత డిసెంబర్ 2న పెనుకొండ, మడకశిర రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
గుర్తులు ఖరారు చేసిన ఎస్‌ఈసీ
గ్రామ పంచాయతీలకు పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతాయి. దీంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించిన చిహ్నాలు బ్యాలెట్ పేపర్‌లో ఉండవు. దీంతో ఎస్‌ఈసీ సర్పంచు స్థానాలకు మొత్తం 25 గుర్తులను ఖరారు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే సర్పంచు అభ్యర్థులకు అవే గుర్తులను కేటాయించాల్సి ఉంటుంది. వార్డు అభ్యర్థులకు మొత్తం 20 గర్తులను ఖరారు చేసింది. వీటినే వార్డుల అభ్యర్థులకు కేటాయిస్తారు.
రెండు ఓట్లు..
జిల్లాలోని 467 గ్రామ పంచాయతీల సర్పంచు, వార్డుల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఇప్పటికే రిజర్వేషన్ల వివరాలు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను అధికారులు ఇంతకు ముందే పూర్తి చేశారు. వార్డు కొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లు సర్పంచు అభ్యర్థి, వార్డు అభ్యర్థికి చెరొక ఓటు వేయాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఎంపికలో తలమునకలు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న పల్లెల్లో సందడో సందడి నెలకొది. ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా...ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు మాత్రం ఈఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సమయం తక్కువగా ఉండడంతో సర్పంచు, వార్డులకు రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపికలో తలమునలయ్యారు. పరిషత్ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో పల్లెల్లో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గలేదు.
సర్పంచు,వార్డుల రిజర్వేషన్లు ఖరారు
పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు
ఎన్నికల ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం
నామినేషన్‌కు కావాల్సిన ప్రధాన పత్రాలు
నామినేషన్ ఫారం(ఫాం–3)అభ్యర్థి, ప్రపోజర్ సంతకాలతో ఆర్‌ఓ దగ్గర తీసుకోవాలి
ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్(అభ్యర్థి, ప్రపోజర్‌ది)
ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలు
ఓటరు లిస్ట్‌లో అభ్యర్థి, ప్రపోజర్ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్
పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
వయసు ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం(రిజర్వ్‌స్థానంలో తప్పనిసరి)
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు జనరల్ స్థానంలో పోటీ చేస్తే డిపాజిట్ నగదు తగ్గింపు కోసం కుల ధ్రువీకరణ పత్రం అవసరం
గ్రామ కార్యదర్శుల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు తప్పనిసరి
నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, చదువు, కుటుంబ వివరాలను ఇద్దరు సాక్షుల సంతకాలతో అఫిడవిట్ రూపంలో సమర్పించాలి
ప్రపోజర్ అదే గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండాలి
నామినేషన్ డిపాజిట్ రసీదు తప్పనిసరి
1 నుంచి 4 సెట్లు నామినేషన్లు వేయడానికి అవకాశం
సర్పంచు, వార్డు అభ్యర్థుల అర్హతలు..
వయసు 21 సంవత్సరాలు ఉండాలి
ఆయా గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండాలి
ప్రభుత్వ ఉద్యోగిగా ఉండకూడదు


