తాడిమర్రి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వరికూటి మైథిలి చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తోంది. తల్లి శ్రమను గుర్తించి అందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతోంది. వివరాల్లోకెళితే.. తాడిమర్రి మండలం దాడితోట ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ము నాగప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె రాధను 17 ఏళ్ల క్రితం తాడిపత్రి వద్ద ఓ పల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి కుమార్తె మైథిలి జన్మించడంతో వారి సంసారం సంతోషంగా సాగింది. అయితే నాలుగేళ్ల క్రితం భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి రాధ దాడితోటకు వచ్చి భర్తకు దూరంగా ఉంటోంది. భర్త అండదండలు లేకున్నా కూడా ఆమె అధైర్యపడకుండా బిడ్డకు ఉన్నత చదువు చదివించాలనే ఉద్దేశంలో కూలి పనులకు వెళుతూ కష్టపడి చదివిస్తోంది. పాఠశాల పీడీ కేశగాళ్ల జయలక్ష్మి మైథిలిలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించింది. దీంతో ఆమెకు సాఫ్ట్‌బాల్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తున్న మైథిలి
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ..
గత ఏడాది విద్యార్థిని అండర్ 14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కడపలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉత్తమ ఆటతీరు ప్రదర్శించింది. అదే ఏడాది నవంబర్ 24, 25, 26 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ అటతీరు ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపికై ంది. మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో సెప్టెంబర్ 26 నుంచి 30 తేదీల్లో జరిగిన 39వ సబ్ జూనియర్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ జాతీయ స్థాయి పోటీల్లోనూ తన ఆట తీరుతో అందరినీ ఆకర్షించింది. జిల్లా సరిహద్దులో మారుమూలన ఉన్న దాడితోట ఖ్యాతి జాతీయ స్థాయికి చేరడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆ అమ్మాయికి ఆలనాపాలన చూడాల్సిన తండ్రి దగ్గర లేడు. అవసరాలకు కావలసిన వస్తువులు తీయించడానికి ఆర్థిక స్థోమత లేని తల్లి. కూలికి వెళితే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. అయితే బిడ్డను ఉన్నత స్థాయిలో చూడాలని ఆశించిన తల్లి శ్రమకు ప్రతిఫలం లభిస్తోంది. ఆ విద్యార్థిని చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది.


