అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రాదేశిక ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ మెజార్టీ గణనీయంగా తగ్గిందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పరిటాల సునీతకు 12 వేల ఓట్ల మెజార్టీ వస్తే.. తాజా ఎన్నికల్లో ఇంచుమించు 2 వేల మెజార్టీ మాత్రమే వచ్చిందన్నారు. అది కూడా అక్రమ పద్ధతుల్లో దకకిందన్నారు. మంగళవారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని, 10 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించి ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు. అక్కడ తమ అభ్యర్థులకు గణనీయమైన మెజార్టీ వచ్చేదని చెప్పారు.
రీకౌంటింగ్ కోరినా పట్టించుకోలేదు
తాటిచెర్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 5 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు ప్రకటించారని, ఎన్నిసార్లు రీకౌంటింగ్ కోరినా అధికారులు స్పందించలేదని ప్రకాష్‌రెడ్డి అన్నారు. రాప్తాడు మండలం ఎం.చెర్లోపల్లిలో తమ అభ్యర్థి 110 ఓట్లతో గెలిస్తే.. టీడీపీ అభ్యర్థి 21 ఓట్లతో గెలిచినట్లు ధ్రువీకరించారని పేర్కొన్నారు. అనంతపురం రూరల్ మండలంలో గెలిచిన స్థానాలకు కూడా డిక్లరేషన్లు ఇవ్వకుండా టీడీపీకి ఇచ్చారని విమర్శించారు. ఆర్‌ఓ నారాయణస్వామి టీడీపీ నేతలు, రౌడీషీటర్లతో చర్చించిన తర్వాత నిర్ణయాలు ప్రకటించారని ఆరోపించారు. కౌంటింగ్ ఏజెంట్లను బెదిరించి బయటకు పంపారన్నారు. ప్రసన్నాయపల్లి–2లో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి భర్త పామురాయి వెంకటేష్ తమ నేతలపై దాడులకు పాల్పడినా అధికారులు పట్టించుకోలేదన్నారు.
సీసీ కెమెరాల దృశ్యాలు ఇవ్వాలి
ఎన్నికల ప్రచారం, పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు తనను హౌస్ అరెస్ట్ చేశారని ప్రకాష్‌రెడ్డి వాపోయారు. మరోవైపు పరిటాల సునీత ప్రచారంలో పాల్గొనడంతోపాటు కౌంటింగ్ కేంద్రాల్లోకి ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు వెళ్లారని విమర్శించారు. రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి కౌంటింగ్ కేంద్రాలతోపాటు రామగిరి, కనగానపల్లి మండలాల్లోని పోలింగ్ కేంద్రాల సీసీ కెమెరాల దృశ్యాలను అందించాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు తెలిపారు. రామగిరి, కనగానపల్లిలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. తమ అభ్యర్థులు, ఏజెంట్లపై దాడులు జరిగినా పోలీసులు నిందితులకు అండగా నిలిచారని విమర్శించారు. ఎన్నికల అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.
పంచాయతీ ఎన్నికలపై ఆందోళన
రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ దౌర్జన్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రకాష్‌రెడ్డి కోరారు. సీఐలు హేమంత్‌కుమార్, శ్రీకాంత్‌యాదవ్ వ్యవహారశైలిపై ఎస్పీ దృష్టి సారించాలని, పంచాయతీ ఎన్నికల వరకు వారిని ఈ ప్రాంతం నుంచి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఓలు నారాయణస్వామి, రవి, కిరణ్‌కుమార్‌రెడ్డిని విధుల నుంచి తప్పించాలని కలెక్టర్‌ను కోరారు. కనగానపల్లి ఎన్నికల అధికారి, ధర్మవరం డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ దౌర్జన్యాలను అడ్డుకోకపోతే మరో వ్యవస్థ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని, 2029 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలనే ఆకాంక్షను ప్రజలు వ్యక్తం చేశారని పేర్కొంటూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు బండి పవన్‌కుమార్, దుగుమర్రి గోవిందరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు బోయ రామాంజనేయులు, కృష్ణారెడ్డి, అక్కంపల్లి లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో 10 వేల ఓట్లు తగ్గుదల
అక్రమాలు, బెదిరింపులతో ఫలితాల తారుమారు
ఎన్నికలపై కోర్టును ఆశ్రయిస్తాం
మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


