పుట్టపర్తి టౌన్: కెనరా బ్యాంక్ గ్రామీణా స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ రిపేరీలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారికి పుట్టపర్తి సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న సంస్థ కార్యాలయంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈనెల 17 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, శిక్షణ కాలంలో ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వాసులై, తెలుగు రాయడం, చదవడం వచ్చిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తమ ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో సంప్రదించాలని కోరారు. వివరాలకు 8977718982 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
జాతీయ జెండా వద్ద
పిచ్చిమొక్కల తొలగింపు
హిందూపురం టౌన్: పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా కొట్నూరు చెరువు కట్టపై నిర్మించిన జాతీయ జెండా ప్రాంతం వద్ద అధికారులు పిచ్చిమొక్కలు తొలగింపజేశారు. జెండా ప్రాంతం వద్ద అపరిశుభ్రంగా ఉండటంపై సాక్షిక్షిలో మంగళవారం ‘ఇదేనా జాతీయ జెండాకు గౌరవం?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన మున్సిపల్ కమిషనర్ జెండా వద్ద పెరిగిన చెట్ల పొదలు, పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించి, శుభ్రం చేయించారు. జాతీయ జెండా పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు జెండాకు తగిన గౌరవం కల్పించాలని సిబ్బందిని ఆదేశించినట్లు కమిషనర్ తెలియజేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకరికి జైలుశిక్ష
కదిరి టౌన్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలుశిక్ష పడింది. వివరాలు..కదిరి పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈసందర్భంగా పట్టణానికి చెందిన రోహిత్, హర్షవర్దన్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వారిని కదిరి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరచగా రోహిత్‌కు 10 రోజులు జైలు శిక్ష, హర్షవర్దన్‌కు రూ.7 వేలు జరిమానా విధించినట్లు పట్టణ సీఐ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
వేధింపులు తాళలేక
విద్యార్థిని బలవన్మరణం
పెనుకొండ రూరల్: యువకుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఎలుకల మందు తాగి బలవన్మరణం పొందింది. స్థానికులు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు..బోయగేరికి చెందిన చందన(15) పట్టణంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన అశ్వర్థ అనే యువకుడు ఆమెను పెళ్లిని చేసుకోమని నిత్యం వేధించేవాడు. ఈక్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సోమవారం రాత్రి ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు హిందూపురం తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున అనంతపురం తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. మృతురాలి తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఘనంగా వెండి రథోత్సవం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రాత్రి వెండిరథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి వెండి రథంపై ఉంచి ప్రాకారోత్సవం చేపట్టారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


