సాక్షి నెట్‌వర్క్:ధర్మవరం నియో జకవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నేతలు అధికారం అండతో రెచ్చిపోయారు. కొన్నిచోట్ల నేరుగా దాడులకు పాల్పడగా..మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులతో ఆపని చేయించారు. ముఖ్యంగా బుధవారం అర్ధరాత్రే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు, ముఖ్య నాయకులను స్టేషన్లకు తరలించారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఉదయమే పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్లు లేకుండా పోయారు. ఆ తర్వాత నాయకులు ఏజెంట్లను కుర్చోబెట్టగలిగినా అప్పటికే కూటమి నేతలు భారీగా దొంగఓట్లు వేసుకున్నారు. అధికార పార్టీ నేతలు ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటించడంతో పోలింగ్ ఏకపక్షంగా సాగింది. ప్రజాస్వామ్యం అపహాస్యమైంది.
● బత్తలపల్లి మండలం మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, మాజీ సర్పంచులు సానే జయచంద్రారెడ్డి, చల్లా కరుణాకర్‌నాయుడు, నాయకులు కోళ్లమొరం దామోదర్‌రెడ్డి, ముష్టూరు సుధాకరరెడ్డి, పోట్లమర్రి సుధాకరరెడ్డిలను పోలీసులు గురువారం ఉదయమే అదుపులోనికి తీసుకుని అక్రమంగా స్టేషన్‌లో నిర్బంధించారు.
● తలుపుల రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుర్లిశివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మున్సిపల్ వింగ్ కార్యదర్శి లింగాల కృపాకర్‌రెడ్డిని గురువారం పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. పోలింగ్ ముగిసిన తరువాత వారిని తిరిగి ఇళ్లకు పంపించారు.


