అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, దుర్మార్గాలు కొనసాగుతూనే ఉన్నాయని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. గురువారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తమ పార్టీ నాయకులు బయట తిరగకుండా గృహ నిర్బంధాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే బుధవారం తనను గృహ నిర్బంధం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీ నాయకులు శాసిస్తున్నారని, ఎన్నికల పేరుతో ఎంపికలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ఈసీ స్పందించాలని ఆశిస్తున్నానని తెలిపారు. అధికార పార్టీల నాయకులు దౌర్జన్యాలు చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నికలు దేశంలో ఎప్పుడూ జరగలేదని వ్యాఖ్యానించారు. గురువారం జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.
లక్ష్మీకి నాణ్యమైన వైద్యం అందించండి
● జీజీహెచ్ వైద్యులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సూచన
అనంతపురం సిటీ: రాప్తాడు ఉన్మాది రంపం దాడిలో గాయపడి జిల్లా సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మికి నాణ్యమైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు సూచించారు. కమిషన్ సభ్యులు, చల్లా మధుసూదనరావుతో కలిసి బుధవారం జీజీహెచ్‌ను ఆయన సందర్శించారు. చికిత్స పొందుతున్న లక్ష్మిని పరామర్శించి, ఆమె ఆరోగ్య స్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలిక సంపూర్ణంగా కోలుకునే వరకూ అవసరమైన అన్ని రకాల చికిత్సలూ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ కరుణ, సీఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ సుధారాణి, ఆర్థో సర్జన్ డాక్టర్ గౌస్, డీసీపీఓ మంజునాథ్, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కృష్ణమాచారి, డీసీపీయూ యూనిట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
తండ్రీకొడుకులపై దుండగుల దాడి
గుత్తి: పట్టణంలోని జెడ్.వీరారెడ్డి కాలనీకి చెందిన తండ్రీ కొడుకులు గంగరాజు, చరణ్‌లపై బుధవారం సుమారు పది మంది కట్టెలు, రాడ్లు, పైప్‌లతో విచక్షణారహితంగా దాడి చేశారు. గంగరాజు ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన కుమారుడు చరణ్‌పై కూడా దాడికి చేయడమే కాక చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. మూక దాడిలో గాయపడిన తండ్రీ కొడుకులను స్థానికులు, కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారెవరు.. ఎందుకు దాడికి పాల్పడ్డారనే విషయాలు విచారణలో వెల్లడి కావాల్సివుంది.


