ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ నామినేషన్లు వేయడానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులను రెండు రోజులు నామినేషన్లు వేయనీకుండా రాప్తాడు, రామగిరి, కనగానపల్లి, ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి, అనంతపురం రూరల్ మండలాల్లో పచ్చనేతలు అడ్డుకొన్న సంగతి తెలిసిందే. నామినేషన్ వేయడానికి వస్తున్న అభ్యర్థులపై రాళ్ల దాడులు చేయడం, అలాగే మహిళలు అని కూడా చూడకుండా నామినేషన్ పత్రాలను వారి వద్ద నుంచి బలవంతంగా లాక్కోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క నామినేషన్ పడకూడదనే పరిటాల ఆదేశాలతో అన్ని స్థానాలను ఏకగ్రీవం చేయాలని పచ్చనేతలు కుట్రలు పన్నారు. చివరకు ఎన్నికల కమిషన్ దృష్టికి వైఎస్సార్‌సీపీ నేతలు తీసుకెళ్లడంతో మూడోరోజున పోలీసుల భద్రతతో వైఎస్సార్‌సీపీ నేతలు అడపాదడపా నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి వచ్చింది.
● గతంలో రామగిరిలో పది ఎంపీటీసీ స్థానాలకు గాను తొమ్మిది స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి చివరకు వారిని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేస్తూ ఒక్క ఎంపీటీసీతోనే ఎంపీపీ పీఠాన్ని టీడీపీ కై వసం చేసుకుంది.
● ప్రస్తుతం గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ చివరకు సొంత గ్రామాలను సైతం వదలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. రక్తపాతం వదలి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగు నీరందిస్తే తాము పంటలను సాగుచేసుకుంటూ కుటుంబపోషణ చేసుకుంటామని ప్రజలు కోరుతున్నారు. కానీ పరిటాల అరాచకాలతో ఆ పరిస్థితులు మచ్చుకైనా కనిపించడం లేదు.


