శెట్టూరు: అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం, కార్యక్రమాలు ముగిసినప్పటికీ బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే అమిలినేని తనయుడు యశ్వంత్ స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించడమే కాక గ్రామంలో పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. పట్టపగలు అధికార పార్టీ నాయకులు కోడ్ ఉల్లంఘించి సమావేశాలు, ర్యాలీ చేస్తున్న అధికారులు, పోలీసులకు పట్టకపోవడంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు, స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. బుధవారం (నేడు) ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే తనయుడు తమ పార్టీకి ఓటేయాలని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేయడమే కాక అభివృద్ధి చేస్తామంటూ ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే తనయుడిపై చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ మండల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


