ముదిగుబ్బ: అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మలకవేమల క్రాస్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు తలుపుల మండలం సజ్జలకుంటపల్లి గ్రామానికి చెందిన కుళ్లాయప్ప కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతిగా మద్యం సేవించడంతో మృతిచెందినట్టు తెలుస్తోంది. కాగా కుళ్లాయప్ప మలకవేమల క్రాస్ ఎందుకు వచ్చాడు? పూటుగా మద్యం సేవించడంతోనే మృతి చెందాడా లేక కారణం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. పట్నం ఏఎస్‌ఐ వెంకటరాముడు సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుతూరు ఉన్నారు.
బాలిక కుటుంబానికి
అండగా ఉంటాం
● పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
తమీమ్ అన్సారియా
అనంతపురం ఎడ్యుకేషన్: రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపిక కుటుంబాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం పరామర్శించారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గోపిక ఆరోగ్య పరిస్థితి, ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులు, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు విద్యాశాఖ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం, విద్యాశాఖ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆమె వెంట ఆర్జేడీ శామ్యూల్, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అయూబ్ హుస్సేన్, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ఉన్నారు.
మనస్తాపమా.. మరేదైనా కారణామా?
● మద్యం మానేయాలని
మందలించడంతో వ్యక్తి ఆత్మహత్య
● మృతుడి కాళ్లు నేలపై ఉండడం.. కర్రకు ఉరివేసుకోవడంపై అనుమానాలు
● విచారణలో తేలనున్న నిజాలు
బత్తలపల్లి: మద్యం మానేయాలని సహచరిణి చెప్పడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కట్టకిందపల్లి గ్రామ శివారు గంగాదేవి చెరువు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. మహరాష్ట్రలోని పూణే జిల్లా లోనావాలా మండలం కునేనామా గ్రామానికి చెందిన నిక్లాస్ విజయ్ వాఘ్మోరే(48) తన భార్య మరణించడంతో మంగళ్ నిక్లాస్ వాఘ్మోరేతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. వీరు ఉపాధి నిమిత్తం గతేడాది నవంబర్‌లో బత్తలపల్లి మండలం కట్టకిందపల్లికి వలస వచ్చారు. బొగ్గుల తయారీ పనులు చేస్తూ, కట్టకిందపల్లి చెరువు వద్ద తాత్కాలిక గుడారాలు వేసుకొని అక్కడే ఉంటున్నారు. అయితే విజయ్ మద్యానికి బానిసవ్వడంతో మంగళ్ ఆ అలవాటు మానేయాలని పలుమార్లు మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అక్టోబర్ 31న (శనివారం రాత్రి) పక్కన ఉన్న తాత్కాలిక గుడారానికి విజయ్ వెళ్లాడు. ఆదివారం ఉదయం మంగళ్ లేచి గుడారంలోకి వెళ్లి చూసేసరికి కర్రకు తాడుతో ఉరివేసుకొని ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న వెంటనే బత్తలపల్లి ఏఎస్‌ఐ రాము తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తొలి భార్యకు ఇద్దరు కుమారులు, మంగళ్‌కు కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా మృతుడి కాళ్లు నేలకు ఆనుకొని ఉండడం కర్రకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు లోతైన విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని గ్రామస్తులు అంటున్నారు.


