కదిరి టౌన్: వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు షేక్ బాబ్జాన్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆదివారం పట్టణంలోని 18వ వార్డు పోలింగ్ కేంద్రం వద్దకు కొందరు మహిళలు బురఖా వేసుకొని వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు. గమనించిన షేక్ బాబ్జాన్ విషయాన్ని కదిరి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్రకు చెప్పాడు. దీనికి ఆయన స్పందించకపోవడంతో దొంగ ఓట్లు వేస్తున్న మహిళలను షేక్ బాబ్జాన్ అడ్డుకున్నాడు. దీంతో సీఐ నాగేంద్ర షేక్ బాబ్జాన్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. దొంగ ఓటర్లను అడ్డుకోకపోగా తమ నాయకుడిని ఎలా అరెస్టు చేస్తారంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసు జీపు ముందు నిరసన తెలిపారు. అనంతరం బాబ్జాన్‌ను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సొంత పూచికత్తుపై విడిచిపెట్టారు.
వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి
మున్సిపల్ పరిధిలోని నిజాంవలీ కాలనీలో 18 వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు మైను, ప్యారి, షబ్బీర్, నదీమ్‌పై టీడీపీ నాయకులు హైదర్‌వలీ, జావీదు, మౌలాలి, టకాఫ్ బాబా, అద్దు, జబ్బీర్, ఖాదర్, సిద్ధిక్ దాడి చేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు బాబ్జాన్ ఇంట్లోకి చొరబడి మహిళలపై దాడి చేశారు. దాడిలో ప్యారి, మైను, షబ్బీర్, నదీమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని కదిరి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పరామర్శించిన బీఎస్ మక్బూల్
దాడి జరిగిన విషయం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ పార్టీ నేత బాబ్జాన్ ఇంటి వద్దకు వెళ్లి మహిళలను, దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం బీఎస్ మక్బూల్ మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కుటుంబంపై దాడి చేయడం అమానుషమన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు అరాచకాలకు తెరలేపారన్నారు. మహిళలు, చిన్నారులపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. దాడి ఘటనకు కారణమైన కదిరి రూరల్ సీఐ నాగేంద్రను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పూలశ్రీనివాసరెడ్డి, పీఏసీ సభ్యులు ఎస్‌ఎండీ ఇస్మాయిల్, రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు డాక్టర్ బత్తల హరిప్రసాద్, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదత్‌అలీఖాన్ పాల్గొన్నారు.


