సాక్షి, పుట్టపర్తి
పురపాలక సంఘాల ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. జిల్లా పరిధిలో ఆరు మున్సి పాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.ఆరు మున్సిపల్ చైర్మన్లతో పాటు 218 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచార పర్వం ముగిసింది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఓటర్ల తీర్పు కోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో కూటమిలో కలహాలు పొడచూపాయి. దీంతో ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం లోపించింది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న చర్చ సాగుతోంది. బీజేపీ, జనసేన అభ్యర్థులకు స్థానిక టీడీపీ నేతల నుంచి ఆశించిన మద్దతు లభించలేదని ఆ పార్టీల నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సమన్వయంతో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆశించిన స్థాయిలోనే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కూటమిలో అంతర్గత పోరు..
కూటమి పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు సహకరించాల్సింది. అయితే చాలా చోట్ల ఆ పరిస్థితి కనిపించలేదు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న వార్డుల్లో మిత్రపక్షాల నాయకులు సహకరించకపోవడం, అంతర్గతంగా మరో వర్గానికి మద్దతు ఇవ్వడం వంటి పరిణామాలు కూటమి అభ్యర్థులను కష్టాల్లో నెట్టాయి. ఎన్నికల వేళ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు ఓట్ల బదిలీపై ప్రభావం చూపుతాయని కూటమి పార్టీల తరఫున బరిలో దిగిన అభ్యర్థులు సతమతం అవుతున్నారు.
వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారే అవకాశం..
కూటమి పార్టీల్లో నెలకొన్న విభేదాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతతో కూటమి పార్టీలకు ప్రచారంలోనూ ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంల చాలా వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని సమన్వయంతో నిర్వహించడంతో పాటు స్థానిక నాయకుల మద్దతుతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఓటింగ్ జరిగితే చైర్మన్ సీట్లతో పాటు అత్యధిక వార్డు స్థానాలకువైఎస్సార్‌సీపీ కై వసం చేసుకునే అవకాశం ఉంటుంది.
నేడే మున్సిపోల్స్
ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు
మొత్తం 218 వార్డుల్లో పోలింగ్
ఓటర్ల తీర్పుపై అభ్యర్థులు,
రాజకీయ పార్టీల ఉత్కంఠ
కూటమిలో కలహం..
ఫ్యాన్‌కు కలిసిరానున్న కాలం
బీజేపీ, జనసేన అభ్యర్థులకు
సహకరించని ‘తెలుగు తమ్ముళ్లు’


