అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం సిటీ: పాఠాలు చెప్పే తరగతి గది.. విద్యార్థుల కేరింతలతో కళకళలాడాల్సిన పాఠశాల ప్రాంగణం.. ఒక్కసారిగా భయానక దృశ్యాలకు వేదికై ంది. పదో తరగతి విద్యార్థిని గోపికపై విద్యుత్ రంపంతో దాడి చేసిన డుంబు అలియాస్ హేమంత్.. ఆమె కిందపడిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే వాకిలి వద్దకు వెళ్లి వెనక్కి చూడగా గోపిక లేచి కూర్చున్నట్లు గుర్తించాడు. అంతే.. మళ్లీ వెనక్కి వచ్చి ఆమైపె విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మీని కూడా వదల్లేదు. రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కాగా నిందితుడు మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్రేమ పేరుతో వేధింపులే కారణమా?
ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన హేమంత్ తల్లిదండ్రులు చనిపోవడంతో అయ్యవారిపల్లిలోని తన సోదరి వద్ద ఉంటూ టమాట మండీలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన వెంకటరాముడు, నరసమ్మ దంపతులకు కుమార్తె గోపికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, ఆమె నిరాకరించడంతో ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలకు వచ్చే ముందు మద్యం సేవించినట్లు తెలిసింది.
సీసీ కెమెరాలే కీలకం...
ఘటన అనంతరం పోలీసులు పాఠశాలలోని సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాఠశాలలోకి వచ్చిన సమయం, అక్కడ ఉన్న వ్యవధి, బయటకు వెళ్లిన మార్గాన్ని పరిశీలించారు. ధర్మవరం వైపు వెళ్లినట్లు గుర్తించి రైల్వేగేటు సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పిల్లలను బడికి ఎలా పంపాలి?
ఆస్పత్రి వద్దకు చేరుకున్న గోపిక, లక్ష్మీ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది ఉపాధ్యాయులు, సిబ్బంది, వాచ్‌మన్ ఉన్న పాఠశాలలోకి ఒక వ్యక్తి విద్యుత్ రంపంతో ఎలా ప్రవేశించాడని ప్రశ్నించారు. తమ పిల్లల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ‘మాకు కేసులు వద్దు.. వాడిని అప్పగించండి. పాఠశాలలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపైనా చర్యలు తీసుకోవాలి’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు.
నిందితుడిని మాకప్పగించండి
ప్రేమోన్మోది హేమంత్‌పై తాము పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయబోమని, నిందితుడిని తమకు అప్పగిస్తే మిగిలిన పని తామే చేసుకుపోతామని బాధితురాలి బంధువులు ఆగ్రహంతో వ్యక్తం చేశారు. గంజాయికి అలవాటుపడిన హేమంత్ జులాయిగా మారి పలుమార్లు తమ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తూ వచ్చాడని, ఈ విషయాన్ని గతంలో తాము పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదన్నారు. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పరామర్శ..
రాప్తాడు ఘటనలో గాయపడిన బాలికను వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం వెన్నపూస రవీంద్రారెడ్డి, ప్రసన్నాయపల్లి మహానందరెడ్డి, ఐద్వా సావిత్రి తదితరులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
మద్యం మత్తులోనే గోపికపై దాడి చేసిన నిందితుడు హేమంత్ !
ఇలాగైతే పిల్లలను ప్రభుత్వ బడులకు ఎలా పంపాలంటున్న తల్లిదండ్రులు
దిగ్భ్రాంతికి గురయ్యానంటున్న ఉపాధ్యాయురాలు


