● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
కదిరిటౌన్ /కదిరి అర్బన్: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శనివారం కదిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో భద్రత ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌ల పనితీరు, లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సిబ్బందికి కేటాయించిన విధులు, సీసీ కెమెరాల నిఘా, విద్యుత్, తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం తదితర అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కళావతి, కదిరి ఇన్‌చార్జ్ కమిషనర్ క్రాంతికుమార్, తహసీల్దార్ రెడ్డిశేఖర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
300 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం జరగనున్న పోలింగ్‌కు 300 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మాణిక్యరావ్ తెలిపారు. శనివారం పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఎన్నిక విధులపై సిబ్బందికి సూచనలు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ పుట్టపర్తి పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక డీఎస్పీ, ఐదుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్‌ఐలు, 285 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల లెక్కింపు వరకు 30 పోలీస్ యాక్ట్, 144 యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.


