బడుల్లో భద్రత గాలికి! | - | Sakshi
Sakshi News home page

బడుల్లో భద్రత గాలికి!

Nov 1 2026 12:22 PM | Updated on Nov 1 2026 12:22 PM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకచోట విద్యార్థులు గంజాయి మత్తులో పాఠశాలకు వస్తుంటే.. మరోచోట మద్యం మత్తులో బడికి చేరుతున్న పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. మరో పాఠశాలలో కల్లు సేవించిన ఘటన కలకలం రేపింది. ఇంకోచోట విద్యార్థులే చోరీలకు పాల్పడ్డారు. ఇవన్నీ ఒకవైపు ఉంటే.. తాజాగా రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏకంగా పదో తరగతి బాలికపై విద్యుత్‌ రంపంతో ఓ ఉన్మాది దాడి చేయడం కలవరపాటుకు గురిచేసింది. నెల వ్యవధిలో అనంతపురం నగర, పరిసర ప్రాంతాల్లో వెలుగుచూసిన ఈ ఘటనలు ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ, క్రమశిక్షణ, విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

గంజాయి మత్తులో బడికి..

మద్యం మత్తులోనూ

అనంతపురంలోని ఓ పాఠశాలలో కొందరు విద్యార్థులు గంజాయి సేవించి బడికి వచ్చిన ఘటన ఉపాధ్యాయుల దృష్టికి వచ్చింది. మరో పాఠశాలలో విద్యార్థులు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చినట్లు గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. చిన్న వయసులోనే మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్న విద్యార్థుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

కల్లు తాగి తరగతికి..

విద్యారణ్యనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొందరు విద్యార్థులు కల్లుతాగడం కలకలం రేపింది. బడి గోడ దూకి కల్లుతాగి తిరిగి లోపలికి రావడం పాఠశాలల పర్యవేక్షణ తీరుపై చర్చకు దారితీసింది. మరోవైపు పాపంపేట ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చోరీలకు పాల్పడిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. వరుసగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, పాఠశాలల పర్యవేక్షణపై ఆందోళన కలిగిస్తున్నాయి.

రాప్తాడులో రక్తపాతం..

ఈ ఘటనలు మరువకముందే రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం మరో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని గోపికపై హేమంత్‌ అనే వ్యక్తి విద్యుత్‌ రంపం మిషన్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మీని కూడా గాయపరిచాడు.

భద్రతా ఏర్పాట్లు ఏవీ?

రాప్తాడు ఘటనలో నిందితుడు విద్యుత్‌ రంపంతో ఏకంగా తరగతి గదిలోకి ప్రవేశించడం పాఠశాల భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. సాధారణంగా పాఠశాల గేటు వద్ద పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా, ఘటన జరిగిన సమయంలో వాచ్‌మన్‌ అక్కడ లేకపోవడం గమనార్హం. నిర్మాణ పనులు జరుగుతున్న పాఠశాలలోకి బయటి వ్యక్తులు సులభంగా ప్రవేశించే పరిస్థితి ఎలా ఏర్పడిందన్నది విచారణలో తేలాల్సి ఉంది. విద్యార్థులు తరగతి గదుల్లో ఉన్న సమయంలో వారి భద్రతకు బాధ్యత వహించాల్సిన యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన

ఒకవైపు మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్న విద్యార్థులు.. మరోవైపు పాఠశాలల్లో చోరీలు, క్రమశిక్షణా లోపాలు.. ఇంకోవైపు బయటి వ్యక్తుల నుంచి భద్రతకు ముప్పు.. ఇలా విభిన్న సమస్యలు ఒకదాని వెంట ఒకటి వెలుగుచూస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గుర్తించడంతోపాటు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించాలి.

అధికారులు ఇప్పటికై నా

మేల్కొంటారా?

ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం పాఠాలు చెప్పడం, హాజరు నమోదు చేయడమే కాకుండా విద్యార్థుల ప్రవర్తన, భద్రత, మానసిక స్థితి, పాఠశాల వాతావరణంపైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించడం, గేట్ల వద్ద పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిర్వహణ, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు కౌన్సెలింగ్‌ వంటి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులను సమీక్షించి లోపాలను సరిదిద్దాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

ఏం జరుగుతోంది?

ఒకే నెలలో అనంతపురంలో

వరుస ఘటనలు

గంజాయి.. మద్యం మత్తులో విద్యార్థులు

పాపంపేటలో కల్లు సేవనం.. చోరీల కలకలం

రాప్తాడులో పదో తరగతి బాలికపై

రంపంతో దాడి

పిల్లలను బడులకు పంపాలంటేనే

భయపడుతున్న తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement