కదిరి టౌన్: రాప్తాడులో అభంశుభం తెలియని విద్యార్థినిపై రంపం దాడి చేయడం అమానుషమని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ శనివారం పేర్కొన్నారు. విద్యార్థినిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధిత విద్యార్థినికి మెరుగైన వైద్యసేవలు అందించి ఆమె త్వరగా కోలుకునేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠనంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాని సూచించారు. విద్యార్థిని త్వరాగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. విద్యార్థిని కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు.
విద్యార్థినిపై దాడి చేసిన
దుండగుడిని కఠినంగా శిక్షించాలి
ధర్మవరం అర్బన్: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడిచేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర డిమాండ్ చేశారు. పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్‌లో శనివారం పీఎస్‌యూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థినిపై దుండగుడు తరగతి గదిలోకి ప్రవేశించి చెక్కమొద్దులు కోసే రంపపు మిషన్‌తో దాడి చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ పాఠశాలకు కూతవేటు దూరంలో పోలీస్‌స్టేషన్, డీఎస్పీ కార్యాలయం ఉన్నా ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
బుక్కరాయసముద్రం: రెడ్డిపల్లి సమీపంలో అనంతపురం తాడిపత్రి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పామిడి మండలం సొరకాయలపేట గ్రామానికి చెందిన సురేష్(40) చెన్నంపల్లిలో వివాహం చేసుకున్నాడు. ఽశనివారం సురేష్ తన మామ మిడతల నాగన్నతో కలిసి బైక్‌పై ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల వద్దకు సొంత పనిమీద బయలుదేరారు. రెడ్డిపల్లి సమీపంలో కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. సురేష్ తల డివైడర్‌కు తగలడంతో తీవ్రగాయాల పాలై అక్కడిక్కడే మృతి చెందారు. నాగన్నకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు నాగన్నను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


