పుట్టపర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి తెరపడింది. ఇన్నాళ్లు ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తిన పట్టణాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. బహిరంగ ప్రచారం ముగియడంతో అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. ప్రచారానికి సమయం ముగిసినా ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు మాత్రం తెర వెనుక ముమ్మరంగా సాగిస్తున్నారు.
ఇంటింటి మంతనాలు..
ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారు. చివరి నిమిషంలో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు స్థానిక నాయకుల ద్వారా మంతనాలు సాగిస్తున్నారు. తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కొందరు అభ్యర్థులు నగదు, ఇతర ప్రలోభాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
ప్రతి ఓటు కీలకమే...
అభ్యర్థుల్లో టెన్షన్
మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల వారీగా పోటీ తీవ్రంగా ఉండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోన మాత్రం ఓటర్ల మనోగతంపై లెక్కలు వేసుకుంటున్నారు. ఏ వార్డులో ఎవరికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి... ఎక్కడ ప్రత్యర్థి బలంగా ఉన్నారు, ఎక్కడ ఓట్లు చీలే అవకాశం ఉంది...తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా స్వల్ప మెజార్టీతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉన్న వార్డులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
పోలింగ్‌కు సర్వం సిద్ధం..
జిల్లాలోని రెండు నగర పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఓటర్లకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రచార పర్వం ముగియడంతో ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం ఓటర్ల చేతుల్లోకి వెళ్లింది. అభ్యర్థుల హామీలు, రాజకీయ సమీకరణాల మధ్య ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
మూగబోయిన మైకులు...
తెర వెనుక మంతనాలు
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు
అభ్యర్థుల పాట్లు
రెండు నగర పంచాయతీలు,
నాలుగు మున్సిపాలిటీల్లో రేపు పోలింగ్
గెలుపోటములపై
రాజకీయ పార్టీలలో ఉత్కంఠ
‘పుర’పోరుపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు 2 వేల మందిని నియమించింది. నవంబర్ 1న పోలింగ్ 787 కేంద్రాల్లో జరగనుండగా...ఆయా ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపుతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తోంది. మరోవైపు పరిషత్ ఎన్నికల హడావుడి కూడా ప్రారంభం కావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పక్కా ప్రణాళికతో పోలీసు అధికారులు ముందుకుసాగుతున్నారు.


