‘హద్దు’దాటుతున్న కిక్కు | - | Sakshi
Sakshi News home page

‘హద్దు’దాటుతున్న కిక్కు

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

హిందూపురం టౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం పోలింగ్‌ జరగనుండగా....జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో శుక్రవారం సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయితే జిల్లాకు కూతవేటు దూరంలోనే కర్ణాటక సరిహద్దు ఉండటంతో.. రాత్రింబవళ్లు మద్యం అక్కడి నుంచి తరలివస్తోంది. చెక్‌పోస్టులో పోలీసుల నిఘా లేకపోవడంతో యథేచ్ఛగా మద్యం అక్రమ రవాణా, విక్రయాలు కొనసాగుతున్నాయి.

సరిహద్దే కీలకం..

జిల్లాలోని 32 మండలాల్లో 16 మండలాలకు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ముఖ్యంగా మడకశిర, హిందూపురం నియోజకవర్గాలు పూర్తిగా కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. కర్ణాటక మద్యం జాతీయ రహదారిపైనే వాహనాల్లో యథేచ్ఛగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నా... కొడికొండ, తూమకుంట చెక్‌పోస్టుల్లో పట్టించుకునే నాథుడే లేరు. దీంతో ఆంధ్రలో మద్యం దుకాణాలు మూసి ఉన్నప్పటికీ బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి.

మత్తులోదించి..ఓట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్‌..

కూటమి అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు మద్యం పంపిణీ ప్రారంభించారు. ఇందుకోసం ఎక్కువగా హిందూపురం సమీపంలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న మద్యం దుకాణాలపై ఆధారపడుతున్నారు. పట్టణానికి కర్ణాటక రాష్ట్రం సమీపంలో ఉండటంతో ఇరు ప్రాంతాల మధ్య నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. వ్యాపార, వ్యక్తిగత అవసరాలతో పాటు వివిధ పనుల నిమిత్తం ప్రజలు ఇరు ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో మద్యం అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా చూడటం ఎకై ్సజ్‌ అధికారులకు పెను సవాలుగా మారింది. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో మద్యం దుకాణాలు బంద్‌ కావడంతో పలువురు కూటమి పార్టీల అభ్యర్థులు సరిహద్దు కర్ణాటక ప్రాంతం నుంచి, అలాగే బెల్టు షాపుల నుంచి మద్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యాన్ని నిల్వ చేసినా, విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా చెక్‌పోస్టుల్లో నిఘా కొరవడడంతో కర్ణాటక మద్యం సరిహద్దు దాటి జిల్లాలోకి దర్జాగా వస్తున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఎకై ్సజ్‌ అధికారులతో సమన్వయం..

మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు హిందూపురం ఎకై ్సజ్‌ అధికారులు, కర్ణాటక ఎకై ్సజ్‌ అధికారులతోనూ సంప్రదింపులు జరిపారు. సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, తనిఖీల నిర్వహణపై ఇప్పటికే సమావేశం నిర్వహించి ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన కార్యాచరణపై సమీక్షించారు. అయినప్పటికీ మద్యం అక్రమ రవాణాకు బ్రేక్‌ పడలేదు.

ఎన్నికల వేళ జిల్లాలో

మద్యం షాపుల బంద్‌

కూతవేటు దూరంలోని

కర్ణాటక నుంచి మద్యం రవాణా

జాతీయ రహదారిపై

చెక్‌పోస్టులు దాటి జిల్లాలోకి సరఫరా

కళ్లుమూసుకున్న అధికారులు..

ఏరులై పారుతున్న మద్యం

నాలుగు బృందాలతో తనిఖీలు

నవంబర్‌ 1న మున్సిపల్‌ పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించాం. శుక్రవారం సాయంత్రానికే మద్యం దుకాణాలను బంద్‌ చేయించాం. స్థానిక సంస్థల పోలింగ్‌, కౌంటింగ్‌ రోజుల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని నోటీసులు జారీ చేశాం. నాలుగు బృందాలతో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నాం. సరిహద్దులపై నిఘా ఏర్పాటు చేశాం. చెక్‌పోస్టుల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశాం.

– లక్ష్మీదుర్గయ్య, ఎకై ్సజ్‌ సీఐ, హిందూపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement