పుట్టపర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నిర్వహించే పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడించారు. జిల్లాలోని రెండు నగర పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ రోజున విధుల్లో 1,500 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. ఇందులో సివిల్ పోలీసులతోపాటు ఏఆర్, స్పెషల్ పార్టీ, ఏపీఎస్పీ బలగాలు ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా విభజించి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పోలింగ్ రోజున ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా రూట్ మొబైల్స్, స్ట్రెకింగ్ ఫోర్స్‌లతో నిరంతరం గస్తీ ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 30 యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్లు ఆంక్షలు విధించామన్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించడంతోపాటు ఇతర ప్రాంతాల వ్యక్తులు జిల్లాలో ప్రవేశించకుండా సరిహద్దులో నిరంతరం తనిఖీలు చేపట్టామన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటు చేసి కంట్రోల్‌రూమ్ నుంచి పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా, అధికారుల విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన..
కదిరి టౌన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం కదిరిలోని ప్రభుత్వ బాలికల కళాశాలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి తీసుకునేందుకు వచ్చే సిబ్బందికి, విధి నిర్వహణలో ఉన్న అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పట్నం పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ వెంట ఆర్డీఓ కళావతి, డీఎస్పీ శివనారాయణస్వామి, మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్, తహసీల్దార్ రెడ్డి శేఖర్ తదితరులు ఉన్నారు.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా
భద్రతా చర్యలు
పోలింగ్ కేంద్రాల వద్ద
30 యాక్ట్ అమలు
నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు
ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడి


