కదిరిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం | - | Sakshi
Sakshi News home page

కదిరిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

కదిరి టౌన్‌: ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్‌ ఎన్నికల్లో తప్పకుండా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరాక కదిరి మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు... రెండున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయారన్నారు. ముఖ్యంగా కదిరి పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనపై ఏమాత్రం దృష్టి సారించలేదన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి కూటమి నాయకులు వస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ నేతలు కదిరి ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, భయభ్రాంతులకు గురి చేసినా వైఎస్సార్‌సీపీ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో చైర్మన్‌ స్థానంతోపాటు కౌన్సిలర్‌ స్థానాలను అత్యధికంగా గెలుచుకుని, కదిరిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని మక్బూల్‌ ధీమా వ్యక్తం చేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క వైఎస్సార్‌సీపీకే దక్కిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ రోజున ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించేలా చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులను మక్బూల్‌ కోరారు.

రెండున్నరేళ్లుగా పట్టణంలో

అభివృద్ధి కుంటుపడింది

ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా

అధికారులు చొరవ చూపాలి

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ

సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement