రామగిరి: మండలంలోని పెనుబోలు సమీపంలో జాతీయ రహదారిపై అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం పట్టుకున్నట్టు ఎస్‌ఐ ప్రదీప్‌రాజ్ తెలిపారు. ఎన్నికల వేళ ముందస్తు సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా గుత్తి నుంచి కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు తరలిస్తున్న బియ్యంను పట్టుకున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ క్రమంలో డ్రైవర్ రామును అదుపులోకి తీసుకొని, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వివరించారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
కనగానపల్లి: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని కేఎన్ పాళ్యంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కేఎన్ పాళ్యం సమీపంలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల్లో కంబదూరు మండలం కొత్తూరుకు చెందిన యల్లప్ప (35) కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా విద్యుత్ లైన్లు అమర్చుతున్న సమయంలో అతడు విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయాడు. తోటి కార్మికులు గుర్తించి అతడిని వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు తెలిపారు.
రైలులో ఉత్తరప్రదేశ్ వాసి మృతి
ధర్మవరం: కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలులో ఉత్తరప్రదేశ్ వాసి బుధవారం మృతి చెందినట్టు రైల్వే జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్‌కుమార్(36) బంధా నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో సీటులో కూర్చున్న అజయ్ ఒక్క సారిగా కూలిపోవడంతో గమనించిన ప్రయాణికులు ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. స్పందించిన రైల్వే పోలీసులు చాంద్‌బాషా, మల్లికార్జున, జ్యోతిలు ధర్మవరంలో ఆగిన రైలులోకి వెళ్లి అజయ్‌ను రైల్వే వైద్యుడు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించగా, అజయ్‌ను రైలు నుంచి కిందకు దించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో కుటుంబసభ్యులకు సమాచారాన్ని అందించారు. అనంతరం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
పొగాకుకు యువత గుడ్ బై చెప్పాలి
పుట్టపర్తి అర్బన్: పొగాకు ఉత్పత్తుల వినియోగంతో యువతలో ఆయుర్దాయం తగ్గిపోతోందని, యువత ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం పేర్కొన్నారు. పొగాకు రహిత యువత కోసం బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి వై.జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో అనర్థాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయని, ధూమ పానంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులు వచ్చి త్వరగా చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే పొగాకుకు యువత గుడ్ బై చెప్పాలని, ఆరోగ్యానికి పునాది వేయాలని పేర్కొన్నారు. అనంతరం పొగాకుకు దూరంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, ఎపిడెమియాలజిస్ట్ బాలాజీ నాయక్, డీపీఎంఓ నాగరాజు, డిప్యూటీ డెమో రామలక్ష్మి, ఎస్‌ఐ శ్రీహరి, సోషల్ వర్కర్ శమంతకమణి, సైకాలజిస్ట్‌లు రాణెమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.
గ్రానైట్ లారీ పైనుంచి పడి కార్మికుడి మృతి
పావగడ: గ్రానైట్ లారీ నుంచి కింద పడి కార్మికుడు మృతి చెందిన ఘటన పావగడ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. పావగడ పట్టణ పరిధి పళపల్లి గ్రామ సమీపంలోనున్న సొప్పులమ్మ ఆలయం వద్ద వెళ్తున్న గ్రానైట్ లారీ రోడ్డుపై వేసిన హంప్స్ కుదుపులకు అదిరింది. దీంతో లారీ వెనుక కూర్చున్న కార్మికుడు ప్రదీప్ దాస్ లారీపై నుంచి కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి తండ్రి రంజిత్ దాస్ తన కుమారుడి చావుకు లారీ డ్రైవర్ సయ్యద్ జబీర్ కారణమని, చంద్రబావి గ్రామం నుంచి గ్రానైట్ లారీలో బూపూరు తండాకు వెళ్తుండగా మార్గ మధ్యంలోని పళవల్లి గ్రామం వద్ద అజాగ్రత్తగా లారీని నడపడంతోనే తన కుమారుడు కిందపడి మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


