● ఎస్పీ సతీష్‌కుమార్
ధర్మవరం అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ధర్మవరం పట్టణంలో మంగళవారం ఎన్నికల భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలైన గూడ్స్‌షెడ్‌కొట్టాల, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. అక్కడ ప్రచారాలు చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులకు ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని సూచించారు. అనంతరం బీఎస్‌ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను ఎస్పీ తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వసతులు, ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, భయబ్రాంతులకు గురిచేయడం, ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవడం లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం నూతన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ సతీష్‌కుమార్ ప్రారంభించారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించడం ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ మహేష్, ధర్మవరం డీఎస్పీ జగన్నాథ్‌రాజు, శ్రీనివాసరావు, సీఐలు రెడ్డెప్ప, జయనాయక్, లింగన్న, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
కనగానపల్లి: మండలంలో సమస్యాత్మక గ్రామాలైన తూంచర్ల, బద్దలాపురం గ్రామాల్లో ఎస్పీ సతీష్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ బలగాలతో కలసి ఆయన ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం స్థానిక రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అలాగే చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల, దామాజిపల్లి గ్రామాల్లో ఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.


