బాబూ.. నీకెందుకు ఓటేయాలి? | - | Sakshi
Sakshi News home page

బాబూ.. నీకెందుకు ఓటేయాలి?

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

చంద్రబాబు మోసకారి

చంద్రబాబు అండ్‌ కో సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు ఎన్నో పథకాలు ఇస్తామని తీరా అధికారంలోకి రాగానే ఒక్క పథకం కూడా అమలు చేయకుండా మోసగించింది. మళ్లీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు. ఎక్కడ చూసినా మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే వాళ్లు ఓట్లు అడగకుండా రోడ్‌ షోలు చేసుకుంటూ పోతున్నారు. ఫ్రీ గ్యాస్‌ అమలు కాలేదు. ఉచిత బస్సులో ఎక్కడానికి కూడా మహిళలు ఇష్టపడడం లేదు. రూ.18 వేలు ప్రతి ఏటా ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. మోసం చంద్రబాబు రక్తంలోనే ఉంది. ప్రజలు గమనించాలి. – నాగమణి, బుక్కపట్నం

పింఛన్లు తొలగించినందుకా.. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టినందుకా..

50 ఏళ్లకే పింఛన్‌ ఏమైందో చెప్పండి

సూపర్‌ సిక్స్‌లో కోత విధించి ఓట్లు అడుగుతారా?

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు

పుట్టపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని ఓటర్లు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయకుండా మోసగించారని , మళ్లీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ , సూపర్‌ సెవెన్‌ పథకాలంటూ ఊదరగొట్టి తీరా గెలిచాక ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగించింది. ఖజానా ఖాళీ అని ఎన్నో సభల్లో బహిరంగంగానే చంద్రబాబు అండ్‌ కో చెప్పారు. ఫ్రీ గ్యాస్‌ పథకంలో ఒక్క విడత మాత్రం అరకొరగా లబ్ధిదారులకు నగదు వెనక్కు వచ్చింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న పాపానపోలేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

ఫ్రీ బస్సు అని చంద్రబాబు సర్కార్‌ గొప్పలు చెబుతున్నా... మహిళలు నిత్యం నరకం చూస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా ఉన్న బస్సులతోనే ఫ్రీ బస్సు పథకం అమలు చేయడంతో మహిళలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, పురుషులు , ఉద్యోగులు నిత్యం ఇబ్బంది పడుతూ గొడవలకు దిగుతున్నారు.

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకంలో ప్రతి నెలా ఎవరొస్తారో ఎక్కడ పంపిణీ చేస్తారో తెలీని పరిస్థితి. అసలు లిస్టులో పేరు ఉంటుందో లేదో అన్న ఆందోళన లబ్ధిదారులకు తప్పడం లేదు. రెండేళ్లలో జిల్లాలో సుమారు 48 వేలకు పైగా పింఛన్లు కోత విధించారు. దీంతో అర్హులు కుటుంబాలు గడవడం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఊదర గొట్టారు. అయితే ఇప్పటికీ ఆ హామీ అమలు కాక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల స్థానిక ఎన్నికలకు ముందు పింఛన్లు ఇస్తామని దరఖాస్తు చేసుకోవాలని పేదలను నమ్మించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది , జిల్లాలో 60 వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్‌ ముగిసింది, అక్టోబర్‌ కూడా ముగుస్తోంది ఇప్పటికీ ఆ హామీ అమలు చేయలేదు.

మహిళకు ప్రతి ఏటా రూ.18 వేలు ఇస్తామని నమ్మబలికారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం లేదంటే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా ఒక్క నిరుద్యోగికి ఇప్పటికీ భృతి అందలేదు.

తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ రూ. 15 వేలు చొప్పున ఇస్తామని నమ్మించారు. తీరా మొదటి ఏడాది ఎగ్గొట్టారు. తర్వాత లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడంతో పాటు కేవలం రూ.13 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి ఏటా రూ.20 వేలు ఏడాదిలో ఒకేసారి ఇస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రం మరో రూ.14 వేలు కలిపి అందజేస్తున్నారు. మొదటి ఏడాది రూపాయి ఇవ్వకుండానే గడిపేశారు.

ఓడిపోతామనే దాడులు

గత ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ప్రజలు తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ చూసినా దాడులు సృష్టిస్తూ బెదరగొడుతున్నారు. చిన్న పదవుల కోసం ఇంతలా దిగజారి రాజకీయం చేయాలా? ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగితే వైఎస్సార్‌సీపీ కచ్చితంగా గెలుస్తుంది. ప్రజలను సక్రమంగా ఓట్లు వేసుకోనిస్తే చాలు.

– ఆవుటాల గోపాల్‌రెడ్డి,

బుచ్చయ్యగారిపల్లి

పింఛన్ల హామీ అమలు ఎక్కడ?

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పథకాన్ని అమలు చేయకుండా మభ్య పెడుతున్నారు. కొత్త పింఛన్లు దేవుడెరుగు వస్తున్న వేలాది మంది పింఛన్లను సైతం తొలగించి కడుపుకొడుతున్నారు. స్థానిక ఎన్నికల కోసమే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. వితంతువులు రెండున్నర ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. కొత్త పింఛన్‌ ఇస్తారన్న ఆశ కూడా లేకుండా ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారు. – గాండ్ల నరసింహులు,

చిన్నబోయినపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement