పుట్టపర్తి: స్థానిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ అరాచకాల మధ్య మరో ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు తీరాక జిల్లా పరిషత్ ఎన్నికల బరిలో 141 మంది అభ్యర్థులు జాబితాలో మిగిలారు. మొత్తం 32 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నవంబర్ 3న ఎన్నికలు
పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కొందరు రెండు మూడు సెట్లు నామినేషన్లు వేయగా అన్ని పార్టీల నుంచి ఇద్దరు నుంచి ఐదు మంది వరకు తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు ముగిసేనాటికి 32 జడ్పీటీసీ స్థానాలకు మొత్తంగా 316 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 24న నామినేషన్లను పరిశీలించగా 234 నామినేషన్లను ఆమోదించారు. తాజాగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కావడంతో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన 93 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల అధికారులు తుది జాబితా ప్రకటించే సమయానికి ఎన్నికల బరిలో 141 మంది ఉన్నారు. వీరిని జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నుకునేందుకు నవంబర్ నెల మూడో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తుది జాబితాలో అభ్యర్థుల పేర్లు వెల్లడి కావడంతో వారికి గుర్తులను కేటాయించారు. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు సిద్ధం కానున్నాయి.
రసవత్తరంగా పోరు
జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. జిల్లాలోని 32 జెడ్పీటీసీ స్థానాలకు ఏకంగా 141 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున 32 మంది బరిలో ఉండగా, టీడీపీ తరపున 26, జనసేన 3, బీజేపీ ముగ్గురు, కాంగ్రెస్ తరపున 20 మంది, సీపీఐ (ఎం) 1, బీఎస్పీ 5 మంది, ఇండిపెండెంట్లు 50 మంది, ఇతరులు 1 ఉన్నట్లు జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తుండగా కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి, జనసేనకు చెరో 3 స్థానాలు కేటాయించింది. ఇందులో బీజేపీకి ముదిగుబ్బ, ఎన్‌పీకుంట, తాడిమర్రి మండలాలు, జనసేనకు పుట్టపర్తి, తలుపుల, గోరంట్ల మండలాలను కేటాయించింది. ఇందులో అత్యధికంగా తాడిమర్రిలో 9 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అమరాపురం, లేపాక్షి మండలాల్లో కేవలం ఇద్దరేసి మాత్రమే పోటీలో ఉన్నారు. అయితే జనసేన, బీజేపీలకు సీట్లు కేటాయించిన స్థానాల్లో టీడీపీ నాయకులు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలిసింది.
ఎంపీటీసీ బరిలో 994 మంది
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని 397 ఎంపీటీసీ స్థానాల బరిలో 994 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని 32 మండలాల్లో 397 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి కోసం మొత్తం 1932 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 994 మంది బరిలో నిలిచారు. ఇందులో వైఎస్సార్‌సీపీ తరఫున 376 మంది, టీడీపీ తరఫున 357 మంది, జనసేన 29, బీజేపీ 22 , కాంగ్రెస్ 60 , బీఎస్‌పీ 2, సీపీఐ (ఎం)5, ఇండిపెండెంట్స్ 142, ఇతర పార్టీల వారు 1 కలిపి మొత్తం 994 మంది బరిలో నిలిచారు. అతి తక్కువగా రామగిరిలో 7 మంది పోటీలో ఉండగా అత్యధికంగా మడకశిరలో 53 మంది, గోరంట్లలో 50 మంది పోటీ పడుతున్నారు. జిల్లాలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. అందులో బత్తలపల్లి మండలంలో 4, సీకేపల్లిలో 5, కనగానపల్లిలో 3, రామగిరిలో 7, చిలమత్తూరు, మడకశిరలో ఒక్కోటి ఏకగ్రీవం అయ్యాయి.
అడ్డదారిలో 24 ఎంపీటీసీ స్థానాల ఏకగ్రీవం
కనగానపల్లి: రాప్తాడు నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు మండలాల్లో అధికార టీడీపీ అడ్డదారుల్లో 24 ఎంపీటీసీ స్థానాలకు ఏకగ్రీవం చేసుకుంది. ఇందులో రామగిరి మండలం నుంచి 7, చెన్నేకొత్తపల్లిలో 5, కనగానపల్లిలో 3, ఆత్మకూరులో 4, రాప్తాడులో 1, అనంతపురం రూరల్ మండలంలో 4 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకున్నారు. టీడీపీ శ్రేణులు చేసిన దాడులు, దౌర్జన్యాలతో రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో నాలుగు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. ఇక నామినేషన్ల పరిశీలనలో ఎన్నికల అధికారులు, సిబ్బందిని అడ్డం పెట్టుకొని చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, ఆత్మకూరు. రాప్తాడు, రూరల్ మండలాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన 20 నామినేషన్లను తిరస్కరించారు.
బలవంతపు ఏకగ్రీవం
చిలమత్తూరు: మండలంలోని దేమకేతపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌ను టీడీపీ నాయకులు బలవంతపు ఏకగ్రీవం చేశారు. అధికారులను బెదిరించి దౌర్జన్యంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మద్దిలేటి ద్వారా అక్రమంగా నామినేషన్ ఉపసంహరణ చేయించారు. మండలంలో పలు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు రెండు రోజులుగా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బేరసారాలకు దిగారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత వేణురెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి పురుషోత్తంరెడ్డి, సీనియర్ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, రాజారెడ్డి, అన్సార్ అహ్మద్‌లతో కలిసి ఆర్‌ఓతో మాట్లాడేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. అభ్యర్థి మద్దిలేటి ద్వారా పోటీలో కొనసాగుతున్నట్లు వినతిపత్రం ఇచ్చినా... టీడీపీ నేతల ఒత్తిళ్లతో దేమకేతపల్లి స్థానాన్ని ఏక్రగీవం చేశారు.
జెడ్పీ బరిలో 141 మంది
93 మంది నామినేషన్ల ఉపసంహరణ
32 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
వచ్చే నెల 3న పోలింగ్‌కు ఏర్పాట్లు
బ్యాలెట్ పత్రాల ముద్రణలో
అధికారుల బిజీ బిజీ


